చంద్రబాబు విడుదల అప్పుడే ? లోకేష్ కు సర్కారే క్లీన్ చిట్ -అచ్చెన్న కామెంట్స్..
ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై టీడీపీ ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతోంది. ఆయన బయటికి రావాలంటూ పూజలు చేస్తోంది. ఇలాంటి సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇవాళ చంద్రబాబు ఎప్పుడు విడుదలవుతారన్న దానిపై టీడీపీ వర్గాల అంచనా బయటపెట్టారు. అలాగే యువనేత నారా లోకేష్ కు ఫైబర్ నెట్ కేసులో ఏపీ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడాన్ని స్వాగతించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిన్న కోర్టులో ప్రభుత్వం చేసిన వాదనలతో ఈ కేసులో డొల్లతనం బహిర్గతమైందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కక్షసాధింపు కోసం అక్రమ కేసులు పెడుతోందన్నది స్పష్టమైందన్నారు. ఎన్నికల వరకూ చంద్రబాబు జైల్లో ఉండాలని జగన్ తాపత్రయం అన్నారు. హడావిడిగా జగన్ రేపు ఢిల్లీకి వెళ్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఈనెల 9 లోపు చంద్రబాబు బయటకు వస్తారని భావిస్తున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. బాబుతో నేను, రిలే నిరాహారదీక్షలు ఈనెల 9 వరకూ కొనసాగుతాయన్నారు. 10 నుంచి వివిధ రూపాల్లో నిరసనలకు కొత్త కార్యక్రమం చేపడతామని అచ్చెన్న వెల్లడించారు. కోర్టు పరిణామాలు చూసి ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను నిర్ణయిస్తామన్నారు. జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యుల కమిటీని త్వరలో ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నట్లు అచ్చెన్న వెల్లడించారు. వామపక్ష పార్టీలతో పొత్తు అంశం చంద్రబాబు నిర్ణయిస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.
రాష్ట్రంలో టీడీపీతో పొత్తు విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన చేసిన తర్వాత సీపీఐ రామకృష్ణ కూడా స్పందించి తమ పార్టీ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు వెల్లడించారు. దీనిపై చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications