AP TET 2024 Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల - ఇలా తెలుసుకోండి - త్వరలో మరో టెట్..!
ఏపీలో ఈ ఏడాది నిర్వహించిన ఉపాధ్యాయ ఉద్యోగాల అర్హత పరీక్ష టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ టెట్ ఫలితాలను విడుదల చేసారు. వీటిని ఆన్ లైన్ లో చూసుకునే అవకాశం కల్పించారు. అలాగే త్వరలో మరో టెట్ నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ టెట్ లో క్వాలిఫై కాని అభ్యర్థులకు, కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తిచేసుకున్న వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే మరో టెట్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఆ తర్వాతే మెగా డిఎస్సీ ఉంటుందన్నారు.

ఇవాళ విడుదల చేసిన టెట్ పరీక్ష ఫలితాలను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ వెబ్ సైట్ లో ఎంటర్ అయిన తర్వాత టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు, హాజరైన అభ్యర్ధుల జాబితా కనిపిస్తుంది. దాని కింద క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్ అనే లింక్ ఇచ్చారు. దీన్ని క్లిక్ చేస్తే మరో పేజ్ ఓపెన్ అవుతోంది. అక్కడ అభ్యర్ధి ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి.
నిరుద్యోగ టీచర్లు గత మూడునెలలుగా ఎదురుచూస్తున్న ఎపి టెట్ ఫలితాలను ఈరోజు విడుదల చేశానని విద్యామంత్రి నారా లోకేష్ ఓ ప్రకటనలో తెలిపారు. టెట్ లో అర్హత సాధిస్తేనే డిఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డిఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజి ఉండటంతో ఈ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2.35 లక్షలమంది నిరుద్యోగ టీచర్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారన్నారు. టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications