జిల్లాల టూర్ వేళ జగన్ కు భారీ ట్విస్ట్-రూ.17.5 కోట్ల బకాయి-చెల్లిస్తేనే జిల్లాల్లో కాన్వాయ్
ఏపీలో ఆర్ధిక పరిస్ధితులు నానాటికీ దిగజారుతున్నాయని విపక్షాలు విమర్శలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం తనదైన శైలిలో పట్టించుకోకుండా ముందుకెళుతోంది. ఇదే క్రమంలో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వం రోజువారీ నిర్వహణలో తలెత్తుతున్న ఇబ్బందులు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ కాన్వాయ్ లో వాహనం కావాలంటూ ఆర్టీవో సిబ్బంది తిరుపతి వెళ్లే కుటుంబం నుంచి లాక్ొన్నవైనం తెలిసిందే. దానిపై ఆగ్రహించిన ప్రభుత్వం సస్పెన్షన్లకు దిగడంతో ఇప్పుడు వారు సర్కార్ కు భారీ ఝలక్ ఇచ్చారు.

ప్రకాశం జిల్లాలో ఘటన
ప్రకాశం జిల్లాలో తాజాగా సీఎం జగన్ పర్యటన సందర్భంగా కాన్వాయ్ కు వాహనాలు లేకపోవడంతో తిరుపతికి కుటుంబంతో సహా వెళ్తున్న ఓ ప్రయాణికుడి నుంచి స్ధానిక ఆర్టీవో అధికారులు ఇన్నోవా కారును లాక్కున్నారు. దీనిపై వివాదం చెలరేగడంతో ప్రభుత్వం ఇందుకు కారణమైన వారిని సస్పెండ్ చేసింది. దీంతో తమకు ఎందుకు వచ్చిన సమస్య అనుకున్నారో ఏమో రవాణాశాఖ అధికారులు ప్రభుత్వానికి ఉన్న వాస్తవ పరిస్ధితిని చెప్పేశారు.

పాత బిల్లులు క్లియర్ చేయాలని లేఖ
సీఎం జగన్ కాన్వాయ్ కోసం గత మూడేళ్లుగా చేసిన ఖర్చుకు సంబంధించి పాత బిల్లులు క్లియర్ చేయాలంటూ రవాణాశాఖ అధికారులు తాజాగా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇందులో వారు సీఎంతో పాటు వీఐపీల కాన్వాయ్ ల కోసం ఈ మూడేళ్లలో రూ.17.5 ఖర్చు పెట్టినట్లు చూపారు. ఈ మొత్తాల్ని తక్షణం చెల్లించాలని రవాణాశాఖ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఈ బకాయిల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

బాకీ తీరిస్తేనే వాహనాలు సమకూరుస్తాం..
రవాణాశాఖ సీఎం, ఇతర వీఐపీల కాన్వాయ్ ల కోసం ఖర్చు చేసిన మొత్తానికి అయిన బకాయిలు వెంటనే చెల్లించకపోతే పర్యటనలకు వాహనాలు సమకూర్చలేమని అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. రవాణామంత్రి సమావేశంలో ఈ అంశాన్ని మంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ఒంగోలు లాంటి ఘటనలు పునరావృతం కావద్దంటే బకాయిలు తీర్చాలని వారు కోరారు. వీఐపీల కాన్వాయ్‌లకు ఏటా కనీసం రూ.4.5 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయించి ప్రత్యేక ఖాతా ద్వారా బిల్లులు చెల్లించాలని వారు లేఖలో కోరారు.

జగన్ జిల్లాల టూర్ వేళ కలకలం
సీఎం జిల్లాల త్వరలో జిల్లాల పర్యటనలు చేయబోతున్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కువగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమైన సీఎం జగన్.. జిల్లాలపై ఎక్కువగా దృష్టిసారించలేదు. కానీ రెండేళ్లలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జిల్లాల పర్యటనలు తప్పనిసరిగా భావిస్తున్నారు. ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించి అందులో ఎమ్మెల్యేలు, మంత్రుల్ని భాగస్వాముల్ని చేస్తున్నారు. ఇప్పుడు తానే స్వయంగా జిల్లాల పర్యటనకు బయలుదేరుతున్న వేళ నిధుల లేమితో రవాణాశాఖ వాహనాలు సమకూర్చలేని పరిస్ధితి రావడం కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications