ఏపీకి చల్లని కబురు: రానున్న రెండురోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, 16 నుంచి జోరు వానలు
అమరావతి/విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవిని తలపిస్తున్న ఎండల నుంచి, ఉక్కపోత నుంచి ఉపశమనం కలగనుంది. రానున్న రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ అధికారులు వాతావరణ మార్పులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జార్ఖండ్ నుంచి ఒడిశా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉత్తరకోస్తా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇప్పటి వరకు నైరుతి నుంచి వాయువ్యం మీదుగా వీచిన గాలులు.. గురువారం నుంచి దిశ మార్చుకుని నైరుతి నుంచి ఈశాన్యం వైపునకు వీయనున్నాయి.

ఫలితంగా వాతావరణంలో మార్పులు రానున్నాయి. ఎండ తీవ్రత క్రమంగా తగ్గనుంది. బుధవారం మాత్రం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అనేక చోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం కూడా పలు చోట్లు ఎండ తీవ్రత కొనసాగనుంది.
అయితే, ఆగస్టు 16న కోస్తా తీరంలో అల్పపీడనం ఏర్పడి ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణ వైపు పయనించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో 16వ తేదీ నుంచి వర్షాలు జోరందుకునే సూచనలున్నాయని పేర్కొంది. మరోవైపు ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
గత కొద్ది రోజులుగా మండిపోతున్న ఎండలు
Recommended Video
కాగా, కోస్తా, రాయలసీమల్లో గత నెల చివరి వారం నుంచి వర్షాలు క్రమంగా తగ్గాయి. ముఖ్యంగా కోస్తాలోని పలు మండలాల్లో వర్షాభావం ఏర్పడింది. ఉత్తరకోస్తాలో పరిస్థితిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో మూడు వారాలుగా సరైన వర్షాలు కురవడం లేదు. దీనికితోడు పడమర, వాయువ్య దిశ నుంచి పొడిగాలులు వీయడం, బంగాళాఖాతంలో అల్పపీడనాల జాడ లేకపోవడంతో కోస్తాలో వాతావరణం వేసవిని తలపిస్తోంది. మరో 4 రోజుల వరకు రుతుపవనాలు బలహీనంగా ఉండి.. ఆ తర్వాత బలపడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.












Click it and Unblock the Notifications