చంద్రబాబుపై మహిళా కమిషన్ సీరియస్-నచ్చని వారికి ఓటేస్తే చంపేస్తారా ?
ఏపీలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు ఆ తర్వాత కూడా కొనసాగుతున్నాయి. తాజాగా విశాఖలోని కంచరపాలెంలో చోటు చేసుకున్న ఘటనతో పాటు పల్నాడు జిల్లా మాచవరంలోనూ మహిళలపై దాడుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ స్పందించింది. రాష్ట్రంలో మహిళల్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులకు కారణం చంద్రబాబు, టీడీపీయేనని కమిషన్ ఛైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి ఆరోపించారు.
రాజకీయాల్లో ముందెన్నడూ లేనివిధంగా తమకు ఓట్లేయలేదనే కక్షతో మహిళలపై దాడులకు దిగిన సంస్కృతిని ప్రతీ ఒక్కరూ ఖండించాలని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి కోరారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళలు తమపై జరిగిన దాడిని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారని ఆమె తెలిపారు.దీనిపై స్పందించిన ఆమె.. బాధితులకు రక్షణ కల్పించాలని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్,ఎస్పీకి లేఖ రాశారు.

ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్ చేసుకుని వారిపై దాడులు చేయడం దుర్మార్గమని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ తెలిపారు. ప్రజాస్వామ్య విలువలకు ఇలాంటి వాతావరణం పూర్తి విరుద్ధమన్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళల్ని దాదాపు 24 గంటలపాటు బంధించి మరీ వారిని కొందరు దుర్మార్గులు చిత్రహింసలకు గురిచేశారని ఆమె ఆరోపించారు.
చివరకు వాళ్లంతా గుడిలోకి వెళ్లి దాక్కున్న పరిస్థితిని చూశామన్నారు. అంటే, వారు స్వేచ్ఛగా నచ్చిన వారికి ఓటేసిన హక్కు లేదా..? అని ప్రశ్నించారు. వారికి నచ్చని వారికి ఓట్లేసినంత మాత్రాన అదే పాపంగా వారిని చంపేస్తారా..? అని ప్రశ్నించారు.ఏంటి ఈ దౌర్జన్యం ..? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా..? అని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ.. మహిళలపై చాలా చిన్నచూపుతో వ్యవహరించారన్నారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్ చేసుకుని వారిపై దాడులకు ఉసిగొల్పుతోన్న చంద్రబాబు తీరుపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications