కోస్తా జిల్లాలపై షర్మిల కీలక నిర్ణయం..! పీసీసీ ఛీఫ్ మార్పు ప్రచారం వేళ..!
ఏపీలో కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టేందుకు అధిష్టానం ఏరి కోరి తెచ్చిపెట్టుకున్న వైఎస్ షర్మిల ప్రభావం చూపలేకపోతున్నారనే విమర్శలు ఉండనే ఉన్నాయి. అందుకే ఆమె స్ధానంలో మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణిని పీసీసీ ఛీఫ్ గా నియమిస్తారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో షర్మిల ఇవాళ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడం లేదన్న విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు జేడీ శీలం, మస్తాన్ వలి తో ఇవాళ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై వీరితో చర్చించారు. ఈ సందర్భంగా జేడీ శీలానికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ ప్రాంతం, మస్తాన్ వలికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంత పార్టీ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు షర్మిల అనంతరం ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యల మీద జేడీ శీలం, మస్తాన్ వలీకి నిర్దేశం చేసినట్లు షర్మిల తెలిపారు.
జేడీ శీలానికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ రీజియన్ , మస్తాన్ వలి గారికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ రీజియన్ పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ సమీక్ష లో ఏఐసీసీ సెక్రటరీ గణేష్ యాదవ్, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మూసాని శ్రీనివాస్ రెడ్డి సైతం పాల్గొన్నట్లు షర్మిల పేర్కొన్నారు.

గతేడాది ఎన్నికలకు ముందు పీసీసీ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల పార్టీ బలోపేతం కంటే తన అన్న జగన్ పై ప్రతీకారం కోసమే అన్నట్లుగా రాజకీయాలు చేసారన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు కూటమి పార్టీలపై విమర్శల విషయంలోనూ చూసీ చూడనట్లుగా ఉంటున్నారన్న చర్చ కూడా జరిగింది. దీంతో కొంతకాలంగా ఆమె కూటమి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ఏ కార్యక్రమంలో మాట్లాడినా ఇంకా జగన్ ప్రస్తావన లేకుండా మాత్రం ముగించడం లేదన్న విమర్శలు అలాగే ఉన్నాయి.












Click it and Unblock the Notifications