ఫీజు రీయింబర్స్మెంట్ పై చంద్రబాబును టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల!
ఏపీ సీఎం చంద్రబాబును ఏపీసీసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో చంద్రబాబు సర్కార్ తీరును ఎండగట్టారు. ఒకప్పుడు వైఎస్ఆర్ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పేదవాడి చదువుకు పండుగలా ఉండేదన్నారు. నేడు చంద్రబాబు నాయుడు పాలనలో అదే పథకం వేల కోట్ల బకాయిలతో చదువంటేనే దండుగగా మారిపోయిందని మండిపడ్డారు.
ఒకవైపు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని భారీ ప్రచారాలు చేస్తూ, మరోవైపు వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెంచుకుంటూ పోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.గత మూడేళ్లుగా రూ.6 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయన్నారు. ప్రస్తుతం ఈ మొత్తం రూ.6,400 కోట్లు దాటినట్లు తెలుస్తోందన్నారు వైఎస్ షర్మిల. పెట్టుబడులకు స్వర్గధామమని చెప్పుకునే రాష్ట్రంలో పేద విద్యార్థుల ఫీజు బకాయిలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

విద్యార్థుల ప్రాణాలతో, వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నందుకు కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని బకాయిలు క్లియర్ చేస్తామని, నేరుగా కాలేజీల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఎక్కడ చూసినా విద్యార్థుల అరణ్య రోదన వినిపిస్తోందన్నారు. సర్టిఫికెట్లు అందక కాలేజీల చుట్టూ కాళ్లు రిగేలా తిరగాల్సిన దుస్థితి వచ్చిందన్నారు.
సర్టిఫికెట్లు లేకపోవడంతో పేద విద్యార్థుల భవిష్యత్తు అంతా అగమ్యగోచరంగా మారిపోయింది. కాలేజీల ఒత్తిడి తట్టుకోలేక చిత్తూరు వంటి ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు ప్రాణాలు తీసుకోవాలని చూసిన సంఘటనలు అత్యంత బాధాకరం అన్నారు.ఇంత ఘోరం జరుగుతుంటే ప్రభుత్వం సాకులు చెప్పడంలోనే బిజీగా ఉందన్నారు. ఫీజు బకాయిల వల్ల కాదని, కాలేజీల ఒత్తిడి లేదని, ఇతర కారణాలున్నాయని చెప్పి నమ్మించాలని ప్రయత్నిస్తోందన్నారు.
ఇది కూటమి ప్రభుత్వానికే చెల్లిన విధానంగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి కొన్ని స్పష్టమైన డిమాండ్లు పెట్టింది. తక్షణం బకాయిలుగా పడిన రూ.6,400 కోట్లను ఒకే విడుతలో చెల్లించాలని డిమాండ్ చేస్తోందన్నారు. సర్టిఫికెట్లు నిలిపివేస్తున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోందన్నారు.
విద్యార్థులకు ఎలాంటి షరతులు లేకుండా సర్టిఫికెట్లు అందేలా చూడాలన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులపై జరుగుతున్న వేధింపులు నివారించేందుకు కాలేజీలపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఏ మాత్రం లోటు రాకుండా చూడాలన్నారు. బకాయిలు పేరుకుపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు చెల్లించి, విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు..














Click it and Unblock the Notifications
