అందుకే చంద్రబాబును అరెస్ట్ చేశాం-సీఐడీ బాస్ సంజయ్ ప్రెస్ మీట్..కీలక వ్యాఖ్యలు..
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును నిన్న రాత్రి అరెస్టు చేసిన సీఐడీ అధికారులు విజయవాడకు తరలిస్తున్నారు. ఇవాళ ఆయన్ను విజయవాడ సీఐడీ కోర్టులో హాజరు పర్చబోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుకు దారి తీసిన కారణాలపై సీఐడీ అదనపు డీజీ ఎన్ సంజయ్ ఇవాళ మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఉన్న సీఐడీ రాష్ట్ర కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.

ఈ ఉదయం రూ.550 కోట్ల స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసినట్లు సీఐడీ బాస్ సంజయ్ ప్రకటించారు. ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్ల నష్టం కలిగించిన కేసులో ఈ అరెస్టు జరిగిందన్నారు. ఏపీ ప్రభుత్వం సీమెన్స్ తో జరిగిన ఒప్పందంలో ప్రభుత్వ వాటా కింద రూ.371 కోట్లు విడుదల చేసిందన్నారు. షెల్ కంపెనీల ద్వారా జరిగిన ఈ మొత్తం స్కాం వెనుక కుట్రదారు చంద్రబాబే అన్నారు. ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇవ్వడం, ఎంవోయూ కుదుర్చుకోవడం ద్వారా ఈ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు.
ఈ స్కాం పూర్తి వివరాలు బయటికి రావాలంటే చంద్రబాబు కస్టోడియల్ విచారణ అవసరమని భావించినట్లు సీఐడీ ఛీఫ్ సంజయ్ తెలిపారు. ఈడీ, జీఎస్టీ అధికారులు ఇప్పటికే ఈ స్కాంపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ స్కాంలో తమకు లభించిన ఆధారాల్ని సంబంధిత కోర్టు ముందుంచుతామన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా సాక్ష్యుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబును అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆధారాలను ట్యాంపర్ చేసే ప్రమాదం కూడా ఉందని అరెస్టు చేయాల్సి వచ్చిందన్నారు.
చంద్రబాబు కేబినెట్ ఆమోదం లేకుండా ఏపీఎస్ఎస్డీసీ పేరుతో కార్పోరేషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్దమన్నారు. ఇది కేవలం స్కాం కోసమే ఏర్పాటు చేసారన్నారు.ఈ కార్పోరేషన్ ఛైర్మన్ తో పాటు గంటా సుబ్బారావును నాలుగు పదవుల్లో ప్రభుత్వం నియమించడం కూడా చట్ట విరుద్ధమన్నారు. స్కిల్ కార్పోరేషన్ తో సీమెన్స్ ఒప్పందం కుదిర్చిన డిజైన్ టెక్ కు సంబంధించిన జీవీఎస్ భాస్కర్ అనే వ్యక్తి, ఆయన భార్య ఐఏఎస్ అపర్ణ కార్పోరేషన్ డిప్యూటీ సీఈవోగా కూడా నియమించారన్నారు. రూ.2500 కోట్లకు పైగా పెట్టుబడుులు సీమెన్స్ కంపెనీ ద్వారా వస్తున్నాయని అసెంబ్లీలో అప్పట్లో ప్రకటించిన చంద్రబాబు.. అధికారికంగా మాత్రం 90 శాతం పెట్టుబడి ఎందుకు రాలేదని అడగలేదన్నారు.












Click it and Unblock the Notifications