ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తం
Summer season: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ఫలితంగా ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. ఇదే తరహా వాతావరణం మరి కొన్నిరోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తోన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పగటి ఉష్ణోగ్రత భారీగా నమోదవుతుందని, వడగాల్పులు వీస్తాయని స్పష్టం చేస్తోన్నారు.

పెరుగుతున్న ఎండలకు వడగాల్పులు తోడు కానున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 107మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదయ్యాయి. మరో 35 మండలాల్లో వడగాల్పులు వీచాయి. దీనికి సంబంధించిన జాబితాను ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ విడుదల చేశారు.
ఈ సాయంత్రం 5 గంటల సమయానికి అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 38 మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదయ్యాయి. నెల్లూరు- 37,కడప- 36, తిరుపతి- 34, శ్రీసత్యసాయి- 32, చిత్తూరు- 31, అనంతపురం- 31, శ్రీకాకుళం- 30, అన్నమయ్య రాయచోటి- 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. మరో 107 మండలాల్లో సాధారణ వడగాల్పులు రికార్డయ్యాయి.
సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర వడగాల్పులు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. జిల్లాలోని చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 93 మండలాల్లో సాధారణ వడగాల్పులు నమోదవుతాయని, ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications