కేంద్రమంత్రికి కరోనా: ఏపీ, తెలంగాణపై పెను ప్రభావం: ఆ భేటీ వాయిదా: ఏపీ వాదనలకు
అమరావతి: ఊహించినట్టే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ నెల 25వ తేదీన నిర్వహించ తలపెట్టిన అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు ఇప్పట్లో పరిష్కారానికి నోచుకునేలా కనిపించట్లేదు. కృష్ణా వరద జలాలను మాత్రమే అదనంగా వినియోగించుకోవడానికి జగన్ సర్కార్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడానికి ప్రతిపాదనలను రూపొందించిన నేపథ్యంలో ఈ వివాదాలు తలెత్తాయి. అదే సమయంలో- రెండు రాష్ట్రాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల గోదావరి, కృష్ణా నదుల పొంగిపొర్లుతున్నాయి.
భారత్‌పై కరోనా పడగ: ఐసొలేషన్లలో ఏడు లక్షల మందికిపైగా: కొత్త కేసుల ఉప్పెన
లక్షలాది క్యూసెక్కుల వరద నీరు సముద్రం పాలవుతోంది. ఈ పరిస్థితుల్లో ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించడానికి ఏర్పాటు కావాల్సిన అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడింది. జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌కు కరోనా సోకడం వల్లే ఈ భేటీ వాయిదా పడింది. ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ సమావేశం వాయిదా పడటం ఇది రెండోసారి. నిజానికి- ఈ అపెక్స్ కమిటీ భేటీ ఈ నెల 5వ తేదీన నిర్వహించాలని భావించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు విజ్ఙప్తి మేరకు ఈ సమావేశాన్ని వాయిదా వేశారు. మంగళవారం నిర్వహించాలని తీర్మానించారు. సమావేశానికి ముందే- గజేంద్ర సింగ్ షెఖావత్ కరోనా బారిన పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫలితంగా ఈ సమావేశాన్ని మరోసారి తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ మేరకు జల్‌శక్తి మంత్రిత్వ శాఖ రెండు రాష్ట్రాల జల వనరుల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.
లక్షలాది క్కూసెక్కుల వరద జలాలు సముద్రం పాలవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అపెక్స్ కమిటీ భేటీ నిర్వహించి ఉంటే ఏపీ తన వాదనలను మరింత బలంగా వినిపించి ఉండేదని అంటున్నారు. గత ఏడాది కూడా వందల టీఎంసీల మేర వరద జలాలు వృధా అయ్యాయని, వాటిని వినియోగించుకోవడంలో భాగంగానే తాము పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను చేపట్టామని ఏపీ చెబుతోంది. అందులో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశామని, వృధా నీటిని సాగు అవసరాల కోసం మళ్లించుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందనేది ఏపీ వాదన.