ఊగిపోయిన రాజయ్య: తెరాసకు 'క్షమాపణ' రివర్స్, రేవంత్‌పై ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైకి గురిపెట్టిన క్షమాభిక్ష అంశం శనివారం తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా రివర్స్ అయింది! రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్న డిమాండుతో గత కొద్ది రోజులుగా సభలో ఆయనను అధికార పార్టీ మాట్లాడనివ్వడం లేదు. ఆయన మాట్లాడేందుకు లేవగానే క్షమాపణలు చెప్పాలని తెరాస సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, నిరూపిస్తానని, కానీ తనను అధికార పార్టీ మాట్లాడనివ్వడం లేదని రేవంత్ రెడ్డి, టీడీపీ సభ్యులు చెబుతున్నారు. సభలో రేవంత్ రెడ్డిని మాట్లాడనివ్వక పోవడాన్ని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు తప్పు పట్టారు. మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఓ సమయంలో మాట్లాడుతూ.. టీడీపీని మాట్లాడకుండా అడ్డుకునే క్రమంలో తమను కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా.. శనివారం తెరాస కూడా చిక్కుల్లో పడింది. ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన నిప్పులు చెరిగారు. సోనియా వల్లనే బలిదానాలు జరిగాయని, మరణించిన వారంతా ఎవరి పేరు రాశారని, బర్త్ డే రోజున రాష్ట్రం ఇస్తే ఆత్మహత్యలు జరిగేవా అని ఊగిపోయారు. దీంతో కాంగ్రెస్ సభ్యులకు ఆగ్రహం కట్టలు తెంచుకు వచ్చింది.

రాజయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీయే తెలంగాణ ఇచ్చిందని, అలాంటి ఆమె పైన ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయవద్దని డిమాండ్ చేశారు. దీంతో, తగ్గిన రాజయ్య తనకు సోనియా అంటే గౌరవమేనని చెప్పారు. అభ్యంతరకరమైనవి ఉంటే సభాపతి రికార్డుల నుండి తొలగించవచ్చునని చెప్పారు. సభాపతి కూడా వాటిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
అయితే, ఈ వివాదాన్ని కాంగ్రెస్ సభ్యులు అంతటితో వదల్లేదు. రాజయ్య క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. అయితే, ఆయన మాత్రం క్షమాపణ చెప్పలేదు.
రేవంత్ పైన ఫిర్యాదు
శాసన సభలో దళిత ఎమ్మెల్యేను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని రేవంత్ రెడ్డి పైన తెలంగాణ న్యాయవాద జేఏసీ సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. తెరాస ఎమ్మెల్యే నల్లాల ఓదేలును ఉద్దేశించి దొరగారి బూట్లు నాకుపో అంటూ వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications