ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!!
ఎండల తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. ఈ రోజు రేపు పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గతం కంటె ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుండే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నం సమయానికి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. మార్చి నెల ముగియకముందే భానుడు భగభగమంటున్నాడు. ఈ నేపథ్యంలో అటు ఏపీ.. ఇటు తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక, ఈ రోజు
రాష్ట్రంలోని పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా, పార్వతీ పురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసర మండలా ల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. రాయలసీమ, సెంట్రల్ ఆంధ్రా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40°C నుండి 42°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.

ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు
కాగా.. అటు తెలంగాణలోనూ క్రమంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎండలు దంచికొట్టే వీలుందని హెచ్చరించారు. దీంతో వికారాబాద్, నారాయణపేట, మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి, సంగారెడ్డి జిల్లాల్లో కూడా 41 నుంచి 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని, ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని... ప్రత్యేకించి సీనియర్ సిటిజన్స్ తో పాటుగా చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు అవసరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications