భారీ ఈదురు గాలులు, పిడుగులతో వర్షాలు - ఈ జిల్లాలకు తాజా అలర్ట్స్..!!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా ఉంది. ఒక వైపు ఎండల తీవ్రత పెరుగుతుండగా.. మరో వైపు అకాల వర్షాలు పలు జిల్లాల్లో కొనసాగుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ అంచనా వేస్తోంది. తాజాగా మారుతున్న వాతావరణంలో పిడుగు పాటు పైన అప్రమత్తం చేసింది. అదే విధంగా రాబోయే మూడు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఏపీ, తెలంగాణలో వాతావరణంలో కొత్త మార్పులు వస్తున్నాయి. ఎండలు ఠారెత్తిస్తున్న సమయం లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగతున్న ద్రోణి కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మారే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సూచించారు. ఉత్తరాంధ్ర, మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రాగల మూడు గంటల్లో ప్రధానంగా విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే వీలుందని చెప్పుకొచ్చారు.

విపత్తుల నిర్వహణ శాఖ సూచనలు
వాతావరణంలో మార్పులు గమనించిన వెంటనే అప్రమత్తమవ్వడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను అడ్డుకోవచ్చని తెలిపారు. రైతులు, కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు వాతావరణ శాఖ ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కోరారు. పిడుగులు, ఈదురు గాలుల సమయంలో ప్రమాదాలను నివారించడానికి వర్షం లేదా పిడుగులు పడుతున్నప్పుడు బయట తిరగవద్దని సూచించారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. పొలాల్లో ఉన్నవారు కూడా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, తీగలు లేదా ఇనుప కంచెలకు దూరంగా ఉండాలని చెప్పారు. గాలివాన సమయంలో పశువులను, గొర్రెలను బయట చెట్లకు కట్టేయకుండా సురక్షితమైన పాకల్లో ఉంచాలని పేర్కొన్నారు. ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వాహనాలపై ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications