APSRTC గుడ్ న్యూస్- స్పెషల్ సర్వీసులు
రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పర్యాటక కేంద్రాలకు ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేస్తోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఇప్పటికే దీనిపై పలు ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ఆధ్యాత్మిక-పర్యాటక ప్రాంతాలను కలుపుతూ పలు ప్యాకేజీలను ఏపీటీడీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటికి సందర్శకుల నుంచి మంచి డిమాండ్ లభిస్తోంది.
ఏపీటీడీసీ బాటలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంట్రీ ఇచ్చింది. పర్యాటకాభివృద్ధి సంస్థ అమలు చేస్తోన్న టూరిజం ప్యాకేజీ తరహాలోనే ప్రయాణికుల కోసం ప్రత్యేక సౌకర్యాలను ప్రవేశపెడుతోంది. దీనికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తమిళనాడులోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అరుణాచలానికి మెజారిటీ డిపోల నుంచి బస్సులను నడిపిస్తోంది. దీంతో పాటు శబరిమలకు ప్రత్యేక ప్యాకేజీ కింద బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

అదే సమయంలో శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా అరకులోయకు స్పెషల్ ప్యాకేజీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీఎస్ఆర్టీసీ. ఈ వింటర్ వీకెండ్ స్పెషల్ ప్యాకేజీ టూర్ కింద ప్రత్యేక బస్సు సర్వీసును ప్రవేశపెట్టింది. విజయవాడ, రాజమండ్రి సహా వివిధ డిపోల నుంచి అరకులోయకు ఈ స్పెషల్ బస్సు రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు పూర్తి చేసింది.
అరకు యాత్ర స్పెషల్ పేరుతో ఈ బస్సులు అందుబాటులో ఉంటోన్నాయి. ఈ యాత్ర అరకులోయ, లంబసింగి, బొర్రా గుహల తదితర ప్రాంతాల మీదుగా సాగుతుంది. పర్యాటక ప్యాకేజీల రూపంలో ఈ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ ప్యాకేజీ ద్వారా అరకును సందర్శించాలనుకునే వాళ్లు సమీప డిపో అధికారులను సంప్రదించాలని ఏపీఎస్ఆర్టీసీ సూచించింది.
అరకు, లంబసింగి, బొర్రా గుహలతో పాటు తంజింగి రిజర్వాయర్, వంజంగి హిల్స్, మత్స్యగుండం, అరకులోయ ట్రైబల్ మ్యూజియం, అరకు పద్మాపురం గార్డెన్స్, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు, తైదా జంగిల్ బెల్స్ ప్రదేశాలను సందర్శించవచ్చు.












Click it and Unblock the Notifications