ప్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చిన బస్సు-విజయవాడ బస్టాండ్ లో కండక్టర్, చిన్నారి సహా ముగ్గురు మృతి
విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాట్ ఫామ్ ముందు ఆగాల్సిన ఓ ఆర్టీసీ బస్సు.. అదుపు తప్పి ప్లాట్ ఫామ్ పైకి దూసుకురావడంతో అక్కడ బస్సు కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.బస్సు అకస్మాత్తుగా దూసుకురావడంతో ప్రయాణికులు పక్కకు తప్పుకునేలోపు ఘోరం జరిగిపోయింది. విజయవాడ ప్రధాన బస్టాండ్ లో జరిగిన ఈ ఘటన మిగతా ప్రయాణికుల్ని భయభ్రాంతుల్ని చేసింది.
ఉదయం విజయవాడ బస్టాండ్ లోని 12వ నంబర్ ప్లాట్ ఫామ్ పై విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేందుకు ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో ప్రయాణికుల్ని పిలిచి బస్సులో ఎక్కించుకునేందుకు కండక్టర్ కూడా బస్సు ముందే ప్లాట్ ఫామ్ పై ఎదురుచూస్తున్నారు. అప్పుడే బస్సు విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా వారిపైకి దూసుకొచ్చింది. ఇందులో బస్సు కండక్టర్ తో పాటు ఓ ప్రయాణికురాలు, ఓ పది నెలల చిన్నారి బస్సు చక్రాల కింద పడి నలిగిపోయారు.

బస్సు ప్రమాద ఘటనతో చుట్టు పక్కల నిలబడి ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి బస్సు కింద నలిగిపోతున్న ప్రయాణికుల్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఘటనకు బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయని కొందరు, రివర్స్ గేర్ వేయబోయి ఫస్ట్ గేర్ వేయడం వల్లే ఇలా జరిగిందని మరికొందరు చెప్తున్నారు. కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications