ఉచితం వేళ.. ఏపీఎస్ఆర్టీసీ భారీ ఆఫర్ !!
APSRTC: ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది.
వచ్చే ఏడాది సంక్రాంతి పండగ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు దిశగా కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన చేస్తోంది చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్. దీనిపై ఇప్పటికే మంత్రివర్గంలో కూడా చర్చించారు. ఈ పథకానికి ఆమోదం తెలిపారు.

ఈ పరిస్థితుల్లో ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్‌ను ఇచ్చింది. సీనియర్ సిటిజన్లకు ప్రయాణ ఛార్జీలో 25 శాతం రాయితీని కల్పించింది. ఈ మేరకు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఓ ప్రకటన విడుదల చేశారు. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ ఆర్టీసీ బస్సులోనైనా ఈ రాయితీతో ప్రయాణించే వీలు కల్పించింది.
60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రయాణికులకు ఈ రాయితీ వర్తిస్తుంది. ప్రయాణ సమయంలో సీనియర్ సిటిజన్లు తమ వయస్సుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, సీనియర్ సిటిజన్ ఐడీ, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, రేషన్ కార్డుల్లో ఏ ఒక్కదాన్నయినా చూపించవచ్చు.
ఏపీకి చెందిన ప్రయాణికులు మాత్రమే కాకుండా ఏ రాష్ట్రానికి చెందిన వాళ్లయినా సరే.. తమ వయస్సును నిర్ధారించే పత్రాలను చూపించి 25 శాతం రాయితీతో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. పల్లెవెలుగు మొదలుకుని ఏసీ స్లీపర్ బస్‌ల వరకూ అన్ని రకాల సర్వీసుల్లోనూ ఈ వెసలుబాటును అందుబాటులోకి తీసుకొచ్చారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు.
ఆ ధృవీకరణ పత్రాలను ఫిజికల్‌గా లేదా డిజిటల్ రూపంలో అంటే.. మొబైల్ ఫోన్‌లో ఫొటో రూపంలో చూపించినా సరిపోతుంది. గతంలో ఈ పథకం అమలులో ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని 2020 మే 21వ తేదీన దీన్ని అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు తాజాగా దీన్ని పునరుద్దరించారు అధికారులు.












Click it and Unblock the Notifications