మరోసారి భారీ భూకంపం.. తప్పిన పెద్ద గండం!
ఉత్తర జపాన్ తీరంలో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. మొదట దీని తీవ్రతను 6.9గా పేర్కొన్నప్పటికీ.. జపాన్ వాతావరణ సంస్థ ఆ తర్వాత దీనిని 7.2 తీవ్రతగా సవరించింది. హోన్షు ప్రధాన ద్వీపంలోని ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో భూగర్భంలో 44 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.
భూకంపం ధాటికి వందల మైళ్ల దూరంలో ఉన్న జపాన్ రాజధాని టోక్యోను కూడా ప్రకంపనలు తాకాయి. ఆమోరి ప్రిఫెక్చర్‌లోని హషికామి ప్రాంతంలో జపాన్ తీవ్రత స్కేలు (షిండో) ప్రకారం 'అప్పర్ సిక్స్' స్థాయి ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ స్థాయిలో వణుకు ఉంటే మనుషులు ఆధారం లేకుండా నిలబడలేరు. భూకంపం కారణంగా ఇళ్లలోని వంట సామాగ్రి కిందపడిపోవడం, దుకాణాల్లోని వస్తువులు చెల్లాచెదురు కావడం, భవనాల సీలింగ్‌లు పాక్షికంగా దెబ్బతినడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

రవాణా, ప్రజా సేవలకు ఈ ప్రకంపనల వల్ల కొంత అంతరాయం కలిగింది. కొన్ని షింకన్‌సేన్ బుల్లెట్ రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయగా.. కొన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. లిఫ్టులలో ప్రజలు ఇరుక్కుపోవడం, ఆటోమేటిక్ తలుపులు పనిచేయకపోవడం, ఓ ట్యాంకర్ ట్రక్కు బోల్తా పడటం వంటి ఫిర్యాదులు అగ్నిమాపక శాఖకు అందాయి. అయినప్పటికీ ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు రాలేదని ప్రభుత్వ ముఖ్య ప్రతినిధి మినోరు కిహారా వెల్లడించారు. అలాగే ఈ ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి అసాధారణ పరిస్థితులు తలెత్తలేదని అధికారులు స్పష్టం చేశారు.
A powerful 6.9-magnitude #earthquake strikes off northern #Japan pic.twitter.com/Dkj4dDDIyO
— Smriti Sharmaa (@SmritiSharma_) June 25, 2026
జపాన్ ప్రధాని సనే తకైచి స్థానిక అధికారులతో కలిసి పనిచేయాలని ప్రభుత్వ సంస్థలను ఆదేశించారు. బలమైన ప్రకంపనలు ఎదుర్కొన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరోసారి భూకంపాలు వచ్చే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్ ఒకటి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడ ఏటా వందలాది ప్రకంపనలు వస్తుంటాయి. ఈ ఏడాది ఏప్రిల్ 20న కూడా జపాన్ ఉత్తర ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించి దాదాపు 10 మంది గాయపడిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications