80 ఏళ్ల స్వాతంత్య్రం..వంతెన కోసం గ్రామస్థుల కన్నీటి గోడు!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వసతుల లేమి సామాన్యుల ప్రాణాల మీదికి తెస్తున్న దయనీయ పరిస్థితిని చాటి చెప్పే ఘటన ఒకటి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కేరమెరి మండలం కోలాంగూడ గ్రామానికి చెందిన ప్రజలు తమ గ్రామానికి కనీస రహదారి, వంతెన సౌకర్యం లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను ఆస్పత్రికి తరలించేందుకు ఉప్పొంగుతున్న వాగులో ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది.
కుర్చీలో మోస్తూ నడుము లోతు నీటిలో ప్రయాణం
గ్రామంలో ప్రాథమిక వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, మరోవైపు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు స్థానిక వాగులు ఉగ్రరూపం దాల్చడంతో గ్రామస్థులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ మహిళ తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో ఆమె ఆస్పత్రికి తరలించేందుకు స్థానిక యువత వేరే దారి లేక సాహసానికి దిగారు. బాధితురాలికి సకాలంలో వైద్యం అందించాలనే తపనతో ఆమెను ఓ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోబెట్టి.. భుజాలపై మోస్తూ నడుము లోతు ప్రవహిస్తున్్న హోరెత్తే వరద నీటిని దాటించారు.

ప్రతి వర్షకాలం నరకమే..
ఈ ఘటనపై కోలాంగూడ గ్రామస్థులు తీవ్ర ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 8 దశాబ్ధాలు గడుస్తున్నా తమ గ్రామానికి ఓ వంతెన నిర్మించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని కన్నీటిపర్యంతం అవుతున్నారు. ప్రతి వర్షాకాలంలోనూ తాము ఇలాంటి భయానకమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందని.. అత్యవసర సమయాల్లో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వాగులు దాటాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి గ్రామస్థుల విజ్ఞప్తి
రవాణా సౌకర్యాలు, వంతెన లేకపోవడంతో కేవలం రోగులే కాకుండా గర్భిణులు, వృద్ధులు, పాఠశాల విద్యార్థులు వర్షాకాలం అంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ కోలాంగూడ గ్రామానికి శాశ్వత వంతెన, రోడ్డు సదుపాయాన్ని నిర్మించాలని.. తమ భయానక ప్రయాణానికి శాశ్వత విముక్తి కల్పించాలని తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications