ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం - ముహూర్తం ఫిక్స్, కండీషన్స్ అప్లై..!!
మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏపీలో అమలుకు రంగం సిద్దమవుతోంది. ఈ పథకం అమలు పైన ఆర్దిక భారం..పొరుగు రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలపైన ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వరుస సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఎన్నికల్లోకి వెళ్తున్న అధికార వైసీపీ ఈ నిర్ణయం పైన ఆచితూచి అడుగులు వేస్తోంది. మహిళలకు ఈ పథకం అమలు చేస్తూనే..ఇతర వర్గాలకు అసౌకర్యం లేకుండా విధి విధానాలు ఖరారు చేస్తోంది.
ఉచిత బస్సు ప్రయాణం: మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏపీలోనూ ప్రారంభానికి రంగం సిద్దం అవుతోంది. దాదాపు సంక్రాంతి నుంచి అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. పధకం అమలు కారణంగా సంస్థ పైన పడే భారం పైన అధికారులు నివేదిక ఇచ్చారు. అదే సమయంలో కర్ణాటక, తెలంగాణలో అమలు సమయంలో ఎదురవుతున్న సమస్యల పైన అధికారులు వివరించారు.

పురుషులకు తలెత్తుతున్న ఇబ్బందులు, ఆటో కార్మికు ల నుంచి వస్తున్న వ్యతిరేకత గురించి అందులో ప్రస్తావించినట్లు సమాచారం. దీని పైన అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఎవరి నుంచి వ్యతిరేకత లేకుండా మహిళలకు ఈ పధయం అమలయ్యేలా కొత్త విధి విధానాలు ఖరారు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి నివేదిక సిద్దం చేసిన తరువాత పరిశీలించి సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
అధికారుల నివేదిక సిద్దం: మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పై మంచి స్పందన కనిపిస్తోంది. కర్ణాటక, తెలగాణలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్టీసీలో నిత్యం సగటున 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 15 లక్షలకు పైగా మహిళలు ఉంటారని తెలుస్తోంది.
ఆర్టీసీకి టికెట్ల విక్రయాల రూపంలో రోజుకు సగటున రూ 17 కోట్లు చొప్పున నెలకు రూ 500 కోట్ల వరకు వస్తోంది. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకు రూ 150-180 కోట్ల వరకు రాబడి కోల్పోయే అవకాశం ఉందని అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా ఇప్పటికే ఆర్టీసీ కి చెందిన రుణాలు.. రీయంబర్స్ మెంట్ ద్వారా ప్రభుత్వం నుంచి అందుతున్న ఆర్దిక ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటున్నారు.
కొత్త మార్గదర్శకాలతో అమలు: దీంతో..ఈ పథకం అమలు చేసినా..ఏ వర్గానికి ఇబ్బందులు..వ్యతిరేకత లేకుండా పకడ్బంధీగా అమలు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా స్పష్టం అవుతోంది. అందులో భాగంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో చోటు చేసుకుంటున్న అంశాల పైన లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అన్ని వివరాలు క్రోడీకరించి ప్రభుత్వానికి ఆర్టీసీ అధికారులు నివేదిక సమర్పించారు.
దీనిని ఆర్దిక, రవాణా శాఖ అధికారులు అధ్యయనం చేసిన తరువాత ముఖ్యమంత్రికి తుది నివేదిక ఇవ్వనున్నారు. దీని పైన సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలని తుది నిర్ణయం తీసుకుంటే ఈ సంక్రాంతి నుంచే అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications