చంద్రబాబు ఉచిత బస్సుకు పులివెందులలో రెస్పాన్స్ ఇదే..!
ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తాజాగా ప్రారంభించింది. ఏడాది ఆలస్యమైన అట్టహాసంగా ఈ పథకాన్ని ప్రారంభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. అయితే ఈ పథకంపై విపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియోజకవర్గం పులివెందులలో ప్రజలు ఈ పథకంపై ఎలా స్పందిస్తున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.
రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీశక్తి ప్రారంభమైన తర్వాత గత మూడు రోజుల్లో పులివెందుల పరిధిలో ఎంత మంది మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకున్నారనే దానిపై ఆర్టీసీ అధికారులు వివరాలు వెల్లడించారు. ఒక్క పులివెందుల డిపో పరిధిలోనే ఉచిత బస్సు పథకం కింద మూడు రోజుల్లో 20 వేల మంది మహిళలు ఈ అవకాశాన్ని వాడుకున్నారని డీఎం రామకృష్ణ వెల్లడించారు. అంతే కాదు నిన్న ఒక్క రోజే ఈ పథకం ద్వారా మహిళలకు 7.5 లక్షలు లబ్ది జరిగిందని తెలిపారు. అలాగే జిల్లాలో ఘాట్ రోడ్లలోనూ ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో ఉచిత బస్సు పథకంపై వైసీపీ విమర్శలు గుప్పిస్తున్న వేళ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోనే మహిళలు ఇంత పెద్ద స్ధాయిలో దీన్ని వాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే వైసీపీ నేతలు ఉచిత బస్సు పథకం ప్లాప్ అని, ఇందులో అన్ని బస్సుల్లో ప్రయాణానికి అనుమతించడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై అధికార పక్షం కూడా ఘాటుగానే కౌంటర్లు ఇస్తోంది. అదే సమయంలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు వివరాలను బయటపెడుతున్నారు.












Click it and Unblock the Notifications