తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుండే బస్సుచోరీ చేసిన ఘనుడు.. ఎలా దొరికిందంటే!
తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్‌లో బస్సు చోరీకి గురైంది. రాత్రి పార్క్ చేసిన అద్దె బస్సు ఉదయానికి కనిపించకపోవడంతో డ్రైవర్, యజమాని ఆందోళనకు గురయ్యారు. జీపీఎస్ సాయంతో ట్రాక్ చేయగా బస్సు నంద్యాల జిల్లా వైపు వెళ్లినట్లు తేలింది. పోలీసులు బస్సును ట్రేస్ అవుట్ చేసి బస్సును స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ నుంచి తిరుపతికి అద్దె ప్రాతిపదికన నడుస్తున్న ఏపీ 39 యూఎక్స్ 9333 నంబరు బస్సు మంగళవారం సాయంత్రం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుంది. డ్రైవర్ నాగేశ్వరరావు, కండక్టర్ బస్సును ప్రాంగణంలో పార్క్ చేసి రెస్ట్ రూమ్‌కు వెళ్లారు. వేకువజామున సుమారు 3 గంటల సమయంలో డ్రైవర్ తిరిగి వచ్చి చూడగా బస్సు అక్కడ లేదు. వెంటనే ఆర్టీసీ అధికారులకు, బస్సు యజమానికి సమాచారం ఇచ్చారు.

తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సు విలువ సుమారు రూ.46 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. యజమాని జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా బస్సు కదలికలను పరిశీలించగా అది నంద్యాల వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. చాగలమర్రి పోలీసుల సహకారంతో మహారాష్ట్రకు చెందిన విష్ణు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని బస్సును స్వాధీనం చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, చోరీకి కారణాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. తిరుమలకు వచ్చే భక్తులు, ఇతర ప్రయాణికులతో 24 గంటలూ బస్సులు రాకపోకలు సాగుతుంటాయి. అలాంటి బిజీ ప్రదేశంలో బస్సు చోరీ కావడం భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రాత్రి సమయాల్లో నిఘా పెంచాలని, సీసీటీవీ కెమెరాలు సరిగ్గా పనిచేస్తున్నాయా చూడాలని సూచనలు వస్తున్నాయి.
జీపీఎస్ సాయంతో త్వరగా ట్రాక్ చేయగలిగినందున బస్సు తిరిగి దొరికింది. లేకపోతే మరింత కష్ట పడాల్సి వచ్చేది.ఇటీవల తిరుపతిలో ఇతర చోరీలు కూడా నమోదయ్యాయి. విద్యానగర్‌లో ఇంటి దొంగతనం, బుచ్చినాయుడుకండ్రిగలో మరో ఘటన జరిగినట్లు సమాచారం. నగరంలో భద్రత పెంచాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. బస్సు దొరకటంతో బస్సు యజమానికి, డ్రైవర్‌కు ఊరట కలిగింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా బస్టాండ్‌లో నిఘా బలోపేతం చేయాలని అందరూ కోరుతున్నారు.













Click it and Unblock the Notifications
