RTC: మహిళల కోసం కొత్త బస్సులు, ఇక ప్రయాణం మరింత హైటెక్!
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'సుస్థిర విద్యుత్ వాహన పాలసీ(4.0)'లో భాగంగా ఆర్టీసీని ఆధునీకరించనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 8,375 డీజిల్ బస్సుల స్థానంలో 2031 నాటికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 'పీఎం ఈ-బస్ సేవా' పథకం కింద 1,050 బస్సులను కేటాయించింది. ఇవి కాకుండా, తాజాగా మరో 1,450 విద్యుత్ బస్సుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ కొత్త బస్సుల కోసం ఏపీఎస్‌ఆర్టీసీ నేరుగా టెండర్లు పిలవనుంది.
కేంద్రం సరఫరా చేసే బస్సుల కంటే మెరుగైన సౌకర్యాలతో ఈ 1,450 బస్సులను రూపొందించనున్నారు. సాధారణంగా విద్యుత్ బస్సులు 8 అడుగుల వెడల్పుతో ఉండి తక్కువ సీట్లను కలిగి ఉంటాయి. అయితే, ఆర్టీసీ ఇప్పుడు 8.5 అడుగుల వెడల్పు గల బస్సులను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల బస్సు లోపల విశాలంగా ఉండటమే కాకుండా, ఎక్కువ మంది ప్రయాణికులు కూర్చునేలా సీట్ల సంఖ్యను పెంచే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) విధానంలో అద్దె ప్రాతిపదికన నడపనున్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యేక విద్యుత్ సర్వీసులు..
జూన్ ఆఖరులో ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. విశాఖపట్నం నగరం నుంచి విమానాశ్రయానికి ప్రయాణించే వారి కోసం తొలి విడతగా 20 ఏసీ విద్యుత్ బస్సులను కేటాయించింది. ఎయిర్‌పోర్ట్ ప్రారంభమైన రోజు నుంచే ఈ షటిల్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా విమాన ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో కూడిన పర్యావరణ హిత రవాణా సౌకర్యం లభించనుంది.
డీజిల్ నుంచి సీఎన్‌జీ వైపు మళ్ళింపు..
రాష్ట్రంలో 'స్త్రీశక్తి' పథకం కారణంగా బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. దీనిని తట్టుకోవడానికి మరియు 15 ఏళ్లు దాటిన పాత బస్సులను తొలగించడానికి 1,000 సీఎన్‌జీ బస్సులను అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో 500 కొత్త బస్సులు కొనుగోలు చేస్తుండగా, మిగిలిన 500 డీజిల్ బస్సులను సీఎన్‌జీ కిట్ల ద్వారా (రెట్రోఫిట్‌మెంట్) మార్పు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రముఖ గ్యాస్ సరఫరా సంస్థలతో ఆర్టీసీ చర్చలు జరుపుతోంది.
ఇంధన వ్యయం తగ్గించుకునే వ్యూహం..
ఆర్టీసీ ప్రస్తుతం నిత్యం 7.5 లక్షల లీటర్ల డీజిల్‌ను వాడుతోంది. బల్క్ కొనుగోలు వల్ల లీటర్‌పై రూ.6 నుంచి రూ.7 వరకు రాయితీ పొందుతోంది. అదే తరహాలో సీఎన్‌జీపై కూడా కేజీకి రూ.4 నుంచి రూ.5 వరకు ధర తగ్గించాలని ఆర్టీసీ గ్యాస్ కంపెనీలను కోరుతోంది. ఒక బస్సు రోజుకు సగటున 400 కిలోమీటర్లు తిరగడానికి సుమారు 80 కేజీల గ్యాస్ అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మార్పుల ద్వారా అటు పర్యావరణాన్ని కాపాడటంతో పాటు, ఇటు సంస్థ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది.














Click it and Unblock the Notifications