ఉచిత బస్సుపై తాడోపేడో..! సంక్రాంతి వేళ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల షాక్..!
తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు పథకంలో ఓ ఇబ్బంది ఎదురవుతోంది. అదే గుర్తింపు కార్డు నిబంధన. ఇతర రాష్ట్రాల ప్రయాణికులు ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు చేయకుండా విధించిన ఈ నిబంధన ఇప్పటికే రద్దీగా మారిన బస్సుల్లో సిబ్బందిపై మరింత ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలో గుర్తింపు కార్డు నిబంధనతో పాటు మరో అంశంపై ఉద్యోగులు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు పథకంలో భాగంగా ఆర్టీసీ (APSRTC) అమలు చేస్తున్న గుర్తింపు కార్డు నిబంధనతో పాటు కండక్టర్లు తనిఖీలు చేయాలన్న రూల్ ను కూడా ఎత్తేయాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.ఈ మేరకు సీఎం చంద్రబాబుకు కూడా విన్నవించుకున్నాయి. అయినా స్పందన లేకపోవడంతో తాజాగా మరోమారు ఆర్టీసీ ఉద్యోగ సంఘం ఎంప్లాయీస్ యూనియన్ పోరుబాట పట్టింది.

స్త్రీ-శక్తి పథకంలో మహిళా ప్రయాణీకులకు గుర్తింపు కార్డు నిబంధనలు తొలగించని కోరుతూ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఉద్యోగ నేతలు కలిశారు. ఇతర రాష్ట్ర మహిళా ప్రయాణీకులు తక్కువగా ఉన్న నేపథ్యంలో కార్డు తనిఖీలు రద్దు చేస్తే కండక్టర్లపై పనిబారం తగ్గుతుందని వారు మంత్రికి వివరించారు. ఈ రెండు నిబంధనలపై ఇప్పటికే ముఖ్యమంత్రికి కూడా వినతిపత్రం ఇచ్చినందున తక్షణం వీటిని రద్దు చేయాలని వారు కోరారు. అలాగే స్త్రీ-శక్తి పథకం విజయవంతం కావాలంటే అదనంగా 3,000 బస్సులు, 10,000 మంది సిబ్బంది నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు విలీనానికి ముందు మెడికల్ అన్‌ఫిట్ అయిన 177 మంది ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని ఉద్యోగ సంఘం కోరుతోంది. దీంతో పాటు పండగ సందర్భంగా ఉద్యోగులకు పిఆర్సీ, డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరింది. రిటైర్డు ఉద్యోగులకు గ్రాడ్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఉద్యోగ నేతలు కోరారు.












Click it and Unblock the Notifications