ఏపీ పారిశ్రామిక చరిత్రలో మైలురాయి.. అతి భారీ స్టీల్ ప్లాంట్ కు ముహూర్తం ఫిక్స్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం శత విధాల కృషి చేస్తోంది. ఏపీని పారిశ్రామికంగా పరుగులు పెట్టించాలని భావిస్తున్న ఏపీ సర్కార్ అనేక పెద్ద పెద్ద పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఏపీలో పరిశ్రమల స్థాపన జరుగుతోంది. ఈ క్రమంలో అనకాపల్లి జిల్లాలో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ను ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సంస్థ ఏర్పాటు చేయనుంది.
ఏపీలో అతి భారీ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
ఈనెల 23వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఈ ప్లాంట్ కి భూమి పూజ చేయనున్నట్టు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాజాగా ధ్రువీకరించారు. దీనికి ఈ నెల 7వ తేదీన శంకుస్థాపన జరగాల్సి ఉండగా, మార్చి 23వ తేదీన శంకుస్థాపన చేయడానికి ధ్రువీకరించినట్లుగా తెలుస్తోంది.

నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏర్పాటు
అనకాపల్లిలోని నక్కపల్లి మండలం రాజయ్యపేట లో 2002 ఎకరాలలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. 1.35 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఏపీలో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకు తొలి దశలో 80 వేల కోట్లతో పనులు ప్రారంభించి, 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు తొలిదశ ద్వారా దాదాపు 30 వేల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త మైలురాయి
రాష్ట్ర పారిశ్రామిక రూపురేఖలను మార్పు చేసే విధంగా ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఏపీలో ఒక కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి పనుల పురోగతిని, శంకుస్థాపన ముహూర్తాన్ని భూపతి రాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త మైలురాయిగా దీనిని ఆయన అభివర్ణించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శంకుస్థాపన తేదీలు
దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పారిశ్రామిక ప్రగతిని మరింత ముందుకు తీసుకు వెళుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు రకరకాల తేదీలు వైరల్ అవుతున్న క్రమంలో ప్రజలలో ఉన్న సందిగ్ధాన్ని తొలగించడం కోసం, ఆయన శంకుస్థాపన తేదీని అఫీషియల్ గా ప్రకటించారు.
చంద్రబాబు చొరవతో త్వరగా అనుమతులు
అంతేకాదు ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి కావలసిన అన్ని అనుమతులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. చాలా తక్కువ సమయంలో దీని మీద నిర్ణయాలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చొరవ కారణంగా అన్ని అనుమతులు త్వరగా వచ్చాయన్నారు. కేంద్రంలో అవసరమైనటువంటి అనుమతులు కూడా అతి తక్కువ కాలంలో క్లియర్ చేయడం కూడా జరిగింది, దానికి తాము కీలక భూమిక పోషించినట్టు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications