ముంచుకొస్తున్నఅతి తీవ్ర తుఫాన్- హుద్‌హుద్, తిత్లీ స్థాయిలో: తాజా హెచ్చరికలు..!!
Arnab Cyclone: ఆర్నాబ్ తుఫాను అత్యంత తీవ్రమైనదిగా అంచనా వేస్తున్నారు. ఎనిమిదేళ్ల కాలంలో తొలి తీవ్రమైనదిగా గుర్తించారు. హుద్‌హుద్, తిత్లీల తరహాలోనే తీవ్రత ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు చేసింది. ఏపీలోని 12 జిల్లాలతో పాటుగా తెలంగాణలోనూ ప్రభావం ఉంటుందని వెల్లడించారు. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. దీంతో.. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది. జిల్లాల అధికారులకు కీలక దిశా నిర్దేశం చేసారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది. తుఫానుగా ఏపీ తీరం వైపు కదులుతోంది. విశాఖపట్నం, కాకినాడ, బాపట్ల తీరాలకు దూరంగా కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు 12 జిల్లా ల్లో కురుస్తాయని చెబుతున్నారు. ఆర్నాబ్ తుఫాను గతంలో ఏపీని వణికించిన పెను తుపానుల తీవ్రతను కలిగి ఉండే అవకాశం ఉందని అంచనా. 2014 నాటి హుద్‌హుద్ సమయంలో గంటకు 260 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. అదే విధంగా 2018 నాటి తిత్లీ 222 కి.మీ. వేగంతో గాలులు వీచిన సంగతి గుర్తు చేసుకుంటున్నారు.

అధికార యంత్రాంగం అప్రమత్తం
కాగా, తాజా అంచనాల ప్రకారం అర్నబ్ కూడా తీరం దాటే సమయంలో అత్యంత ప్రమాదకర మైన తీవ్రతతో విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. ఈసారి ఈ భీకర తుపాను పక్క రాష్ట్రాల వైపు కాకుండా నేరుగా ఆంధ్రప్రదేశ్ తీరాన్నే తాకనుండటంతో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అవసరమైన ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఎల్ నినో కారణంగా కరువు పరిస్థితులు ఏర్పడిన సమయంలో ఈ విస్తారమైన వానలు తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయని భావిస్తున్నారు. తుఫాను కదలికలు అనుగుణంగా అధికారులు సాధారణ ప్రజలకు సమాచారం అందిస్తున్నారు. అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో.. తుఫాను ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయనే సమాచారంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.













Click it and Unblock the Notifications
