నవంబర్ 1న 10లక్షల మందితో ఓట్ చోరీపై ఇండియా కూటమి ఢిల్లీ ఛలో ర్యాలీ!
ఢిల్లీలోని చారిత్రక రామ్‌లీలా మైదానంలో నవంబర్ 1న జరగనున్న ఇండియా కూటమి భారీ ర్యాలీకి కనీసం 10 లక్షల మంది హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. 'ఓట్ చోరీ'కి వ్యతిరేకంగా, ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ సమయంలో జరుగుతున్న అక్రమాలపై నిరసనగా ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. అర్హులైన పౌరుల పేర్లు జాబితా నుంచి తొలగిస్తున్నారని, ఎన్నికల ప్రక్రియలో పక్షపాత ధోరణి కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. రాజ్యాంగాన్ని, పౌరుల ఓటు హక్కును, ప్రజాస్వామ్యాన్ని కాపాడే లక్ష్యంతో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చేపట్టిన 'ఓట్ బచావో దేశ్ బచావో' కాంపెయిన్ ఇప్పుడు కీలక దశకు చేరుకుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయటం కోసం హర్యానాలో పార్టీ సంస్థాగత ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రతి జిల్లా, బ్లాక్, గ్రామం, పోలింగ్ బూత్ స్థాయి నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన హర్యానా నాయకులతో సమావేశం జరిగి ర్యాలీ సన్నాహాలను సమీక్షించారు.
ఢిల్లీ యూనిట్ నాయకులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అధ్యక్షులతో కూడా సమావేశాలు జరిపి లక్ష్యాలు నిర్ణయించారు. ఇంతకు ముందు జరిగిన 'ఢిల్లీ చలో' మార్చ్‌కు ఇది భారీ ముగింపు రూపంగా భావిస్తున్నారు . అక్టోబర్ 30న సీఈసీపై 'పబ్లిక్ ఇంపీచ్మెంట్' కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. రాహుల్ గాంధీ ఆదివారం సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తూ విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, వ్యాపారులందరినీ ర్యాలీకి హాజరు కావాలని పిలుపునిచ్చారు.
"మా ఓట్లు దొంగిలిస్తున్నారు. జాబితాల నుంచి పేర్లు తొలగిస్తున్నారు. ప్రశ్నించినవారిపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. ఇక దేశం స్పందిస్తుంది. నవంబర్ 1 - చలో ఢిల్లీ. ఓట్ బచావో, దేశ్ బచావో," అని సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రం నుంచి 10 వేల నుంచి 15 వేల మంది హాజరు కావాలని పార్టీ నేతలకు సూచించారు.
హిమాచల్ ప్రదేశ్ నుంచి 15 వేల మంది వస్తారని అక్కడి నాయకులు తెలిపారు. ట్రేడ్ బాడీలు కొందరు ర్యాలీని వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసినా, ప్రతిపక్షం ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది.ఈ ర్యాలీ కేవలం ఒక నిరసన కాదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఓటు హక్కు రక్షణకు సంబంధించిన పెద్ద సందేశంగా పార్టీ చెప్తోంది. మరి ఛలో ఢిల్లీ ఎలా జరుగుతుందో.. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications
