ఆలయాలకు వెళ్ళకుండా టీడీపీనేతల అరెస్టులు; పోలీసుల ముందే కొబ్బరికాయలు కొట్టి నిరసన!!
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై నిరసన వ్యక్తం చేస్తూ ఆయన బయటకు రావాలని కోరుకుంటూ ఆలయాలకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్, హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల నుండి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది.
విజయవాడ కనకదుర్గమ్మ గుడి లో కొబ్బరికాయలు కొట్టేందుకు, చంద్రబాబు బయటికి రావాలని కోరుకునేందుకు గుడికి బయలుదేరిన బుద్ధ వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేయడంతో టిడిపి నేత బుద్ధ వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కనకదుర్గమ్మ గుడిలో కొబ్బరికాయలు కొట్టేందుకు బయలుదేరిన టిడిపి నేతలు బుద్ధ వెంకన్నను అరెస్ట్ చెయ్యటంతో టిడిపి నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

బుద్ధ వెంకన్న ను అరెస్ట్ చేయడానికి గల కారణం చెప్పమని టిడిపి నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పాటు, పోలీసుల జీపు లకు వారి వాహనాలను అడ్డుపెట్టి మరీ నిరసన వ్యక్తం చేశారు. దుర్గ గుడికి వెళ్లి రావడానికి పోలీసుల అనుమతి కావాలా అంటూ టిడిపి నేతలు, బుద్ధ వెంకన్న వారిని ప్రశ్నించారు.
చంద్రబాబు అరెస్ట్ తరువాత జరుగుతున్న నిరసన కార్యక్రమాలను పోలీసులు కావాలని నీరు గారుస్తున్నారని టిడిపి నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వైసిపి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని టిడిపి నేతలు మండిపడ్డారు. పోలీసుల అరెస్ట్ చేయడంతో అమ్మవారి ముందు కొట్టాల్సిన కొబ్బరికాయలను పోలీసులు ముందే కొట్టి బుద్ధ వెంకన్న నిరసన వ్యక్తం చేశారు.

ఇక విజయవాడలోని మాచవరం దేవాలయానికి వెళ్లడానికి ప్రయత్నం చేసిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను సైతం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు టిడిపి నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొల్లు రవీంద్ర ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు బయటకు వెళ్లడానికి వీల్లేదని చెప్పడంతో, ఆయన పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రాష్ట్రంలో దేవాలయాలకు వెళ్లడానికి కూడా పోలీసులు అనుమతి కావాలా అంటూ ప్రశ్నించారు. జగన్ రెడ్డి కి ఓటమి భయం పట్టుకుందని కొల్లు రవీంద్ర విమర్శించారు. ఇది అంబేద్కర్ రాజ్యాంగమా లేక రాజారెడ్డి రాజ్యాంగమా అంటూ కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు, అరెస్ట్ లతో ఏపీలో గందరగోళం నెలకొంది.












Click it and Unblock the Notifications