పార్టీ అధికార ప్రతినిధిలా ప్రధాని: అశోక్ బాబు
హైదరాబాద్: ఎన్ని పోరాటాలు చేసైనా విభజన ఆపుతామని ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. విభజనకు సహకరించని ఎంపీలపై రిటైర్డ్ ఉద్యోగులను పోటీకి పెట్టి ఓడిస్తామని హెచ్చరించారు. ఈ అర్ధరాత్రి నుండి సీమాంధ్ర సమ్మెను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
సమ్మెలో పలువురు ఉద్యోగులతో పాటు రెవెన్యూ ఉద్యోగులు కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. ఎన్నికలు జరగాలంటే ఖచ్చితంగా విభజన ఆగి తీరాల్సిందేనని అశోక్‌బాబు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఇప్పటి వరకు విభజనలు చేశారని, ఇప్పుడు విభజన పేరు మీద నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

సమైక్యాంధ్రకు పాటుపడని నాయకులను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ఆయన చెప్పారు. అధిష్టానం కావాలో, ప్రజల ఆకాంక్ష కావాలో ప్రజాప్రతినిధులు తేల్చుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెసు అధికార ప్రతినిధి మాదిరిగా ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరగాలంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆయన అన్నారు.
తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించే రోజు మెరుపు సమ్మెకు దిగుతామని ఆయన చెప్పారు. విద్యుత్తు ఉద్యోగులతో మెరుపు సమ్మె చేయిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications