టీపై మాట మార్చారు: జగన్, చంద్రబాబులపై గండ్ర
హైదరాబాద్: ఓట్లు, సీట్ల కోసం వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు తెలంగాణపై మాట మార్చిందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి విమర్శించారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వైఖరిని కూడా ఆయన తప్పు పట్టారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఆయన శుక్రవారం చర్చను కొనసాగించారు. రాజ్యాంగబద్దంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని ఆయన చెప్పారు.
తెలంగాణకు అనుకూలమని గతంలో చంద్రబాబు, జగన్, వైయస్ విజయమ్మలు చెప్పారని, ఇప్పుడు మాట మార్చారని ఆయన అన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసినవారే రాజ్యాంగ ప్రక్రియను వ్యతిరేకించడం సరి కాదని ఆయన అన్నారు. ప్రతి విషయంలోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని ఆయన విమర్శించారు. గత యాబై ఆరు ఏళ్లలో ప్రతి రంగంలోనూ తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించారని ఆయన అన్నారు.

తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కూడా నీలం సంజీవరెడ్డి నిరాకరించారని ఆయన అన్నారు. సంప్రదింపులు తర్వాతనే తెలంగాణ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. తెలంగాణపై పార్టీలు మాట మార్చడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలమని తెలుగుదేశం తన ఎన్నికల ప్రణాళికలో చేర్చిందని, తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ విషయంలో కనీస సంప్రదాయాలను పాటించలేదని, పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆయన అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలవారి పాత్ర ఉందని, ఇక్కడ ఉండేవారికి అన్ని హక్కులూ ఉంటాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications