Venu Swamy: జగన్ జాతకంలో గండం? ఆరోగ్య సమస్యలు, లీగల్ ఇబ్బందులు అంటూ జోస్యం
రాజకీయ నాయకుల జాతకాలు, వారి భవిష్యత్తుపై జ్యోతిష్కులు చెప్పే లెక్కలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసే కామెంట్స్ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతుంటాయి. తాజాగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జాతకంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. త్వరలోనే ఆయనకు గ్రహబలం అనుకూలించకపోవచ్చని వేణుస్వామి అంచనా వేయడం సంచలనం సృష్టిస్తోంది.
ఇటీవల ఓ సీనియర్ జర్నలిస్ట్ తో ఇంటర్వూలో భాగంగా.. వైఎస్ జగన్ గురించి ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే విమాన ప్రయాణంలో వైఎస్ జగన్ తనకు అనుకోకుండా ఎదురయ్యారని, ఆ సమక్షంలోనే తన భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న అంశంపై చర్చకు వచ్చిందని వేణుస్వామి వెల్లడించారు.

మిథున రాశి, ఆరుద్ర నక్షత్రానికి చెందిన జగన్ జాతకంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోబోతున్నాయని ఆయన తెలిపారు. ప్రధానంగా 2027 జూన్ నెల తర్వాత జగన్‌కు గ్రహాల స్థితిగతులు అనుకూలంగా లేవని, ఆ సమయం నుంచి దాదాపు ఎనిమిది నెలల పాటు తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
అటు ఆరోగ్యం.. ఇటు లీగల్ ఇబ్బందులు!
ఈ కాలంలో జగన్ రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందనేది వేణుస్వామి ప్రధాన హెచ్చరిక. ఒకవైపు శారీరక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని, ముఖ్యంగా వెన్నునొప్పి, కాళ్ల నొప్పులు తీవ్రతరం కావచ్చునని చెప్పారు. సరిగ్గా ఇదే సమయంలో వైఎస్ జగన్ మళ్లీ పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఆరోగ్య సమస్యలు ఆయనకు అతిపెద్ద ప్రతిబంధకంగా మారే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది.
అంతేకాకుండా, గతం నుంచి పెండింగ్‌లో ఉన్న పాత న్యాయపరమైన అంశాలు లేదా కేసులు మళ్లీ తిరగదోడే ప్రమాదం ఉందంటూ వేణుస్వామి వ్యాఖ్యానించడం పొలిటికల్ హీట్‌ను మరింత పెంచింది. గ్రహాల చక్రవ్యూహంలో వైఎస్ జగన్ మళ్లీ లీగల్ ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రావడం తప్పదా అనే అనుమానాలు వైసీపీ శ్రేణుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
గెలిచినా వెంటనే ప్రమాణ స్వీకారం వద్దు!
ఇక భవిష్యత్తు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించినా కూడా ఒక కీలక ముహూర్త నియమాన్ని పాటించాలని వేణుస్వామి సూచించారు. జగన్ జాతకం రిత్యా ఫలితాలు వచ్చిన వెంటనే కాకుండా, కనీసం పది రోజుల వ్యవధి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉత్తర భారతదేశంలోని రెండు శక్తివంతమైన క్షేత్రాలను దర్శించి ప్రత్యేక పూజలు పూర్తి చేశాకే ప్రమాణ స్వీకారం చేయాలని తేల్చి చెప్పేశారు.
అయితే, వేణుస్వామి చెప్పిన ఈ జ్యోతిష్య పరిణామాలను కొంతమంది సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది కేవలం ప్రచార ఆర్భాటమేనని కొట్టిపారేస్తున్నారు. జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్న వేళ ఈ వ్యాఖ్యలు రావడం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా లేదా కేవలం జ్యోతిష్య గణన మాత్రమేనా అనేది రాబోయే కాలమే నిర్ణయించాలి.














Click it and Unblock the Notifications