ఏపీ మున్సిపల్ ఎన్నికలపై మరో అప్డేట్- ఆ 20 చోట్ల హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!
ఏపీలో సాధ్యమైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలు (AP Local Body Elections) నిర్వహించాలని భావిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక్కో అడ్డంకీ క్రమంగా తొలగిపోతున్నాయి. ఇప్పటికే 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మరో 23 చోట్ల మాత్రం కోర్టు కేసులు ఉన్నాయి. దీంతో ఆయా స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో (High Court ) న్యాయపోరాటం చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ 20 చోట్ల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్రంలో 20 పట్టణ స్థానిక సంస్థల్లో (మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, నగర పంచాయతీల్లో ) ఎన్నికల నిర్వహణకు హైకోర్టు ఇవాళ ఆమోదం తెలిపింది. 2021లో గ్రామ పంచాయతీలను పురపాలక, నగరపాలక సంస్థల్లో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయా పిటిషన్లను కొట్టేస్తూ ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది.దీంతో ఆయా చోట్ల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు ఎస్ఈసీకి అవకాశం లభించింది. ఇవి కాకుండా కాకినాడ నగరపాలక సంస్థతో పాటు నరసరావుపేట, ఆమదాలవలస పురపాలక సంఘాలకు సంబంధించిన 3 కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి.

ప్రస్తుతం లైన్ క్లియర్ అయిన 20 పట్టణ స్థానిక సంస్థల్లో రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి (గుంటూరు), శ్రీకాకుళం మున్సిపల్ కార్పోరేషన్లు, రాజాం, చింతలపూడి, తాడిగడప, గుడివాడ, భీమవరం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, కందుకూరు ,పొన్నూరు, కావలి, అల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, పొదిలి, బి.కొత్తకోట, బాపట్ల మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. దీంతో ఆయా చోట్ల ఓటర్ల జాబితా తయారీ, డివిజన్లు, వార్డుల పునర్విభజన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టేందుకు మార్గం సుగమం అయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 30-40 రోజుల్లో ఈ పనులు పూర్తి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే వంద పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించడానికి పురపాలక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు ఈ 20 చోట్ల కూడా ఎన్నికల ముందు చేయాల్సిన పనులు పూర్తయితే వీటిని కూడా కలిపి నిర్వహించే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
