‘పెళ్లయినా భర్తకు దూరంగానే... రిలేషన్లో నేను ఆబ్సెంట్’
శ్రేయా ఘోషల్.. పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ గత కొన్నేళ్లుగా భారతీయ సినీ సామ్రాజ్యాన్ని మహారాణిగా వెలుగొందుతున్నారు. 12 ఏళ్లకే సరిగమప షోలో పాల్గొని విజేతగా నిలిచి సత్తా చాటారు. 20కి పైగా భాషల్లో 3000కి పైగా పాటలు పాడారు. కొత్తగా ఎంతమంది వస్తున్నా.. శ్రేయా గాత్రం ఇప్పటికీ నిత్య నూతనమే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు శ్రేయా మోస్ట్ వాంటెడ్ సింగర్. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే సింగర్స్‌లో ఆమె కూడా ఒకరు. తన చిన్ననాటి స్నేహితుడు శిలాదిత్య ముఖోపాధ్యాయను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శ్రేయ.. ఈ దంపతులకు 2021లో దేవయాన్ అనే కుమారుడు జన్మించాడు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భర్తతో తన అనుబంధం, వైవాహిక జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శిలాదిత్య కూడా టెక్ ప్రపంచానికి బాగా తెలిసిన వ్యక్తి. ట్రూకాలర్‌కు ఆయన గ్లోబల్ హెడ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. బిజినెస్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్స్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ఆటోమేషిన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్‌లో శిలాదిత్య స్పెషలిస్ట్. శ్రేయా ఘోషల్తో దాదాపు 10 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన అనంతరం 2015లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఓ స్నేహితుడి పెళ్లిలో తనకు శిలాదిత్య ప్రపోజ్ చేశారని శ్రేయ తెలిపారు. శ్రేయ పాటలు, సంగీతంలో బిజీగా ఉండగా.. తన వ్యాపార కార్యకలాపాల్లో శిలాదిత్య తీరిక లేకుండా గడుపుతున్నారు. అయినప్పటికీ వీరిద్దరూ తమ బంధాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారు.

తన భర్త శిలాదిత్య, రిలేషన్‌పై శ్రేయా ఘోషల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన బిజీ లైఫ్ కారణంగా భర్తతో కలవడం చాలా అరుదుగా జరుగుతుంది. బలమైన స్నేహం, పరస్పర గౌరవం, అర్ధం చేసుకోవడం వల్లే మా బంధం బలంగా ఉంది. బిజీగా ఉండటం వల్ల రిలేషన్లో తాను ఆబ్సెంట్ వ్యక్తిగా ఉంటాను. అయినప్పటికీ భర్త నుంచి తనకు సంపూర్ణ సహకారం లభిస్తుంది. రిలేషన్షిప్ అంటే ఎప్పుడూ పక్కపక్కనే ఉండటం మాత్రమే కాదు.. ఒకరి భావాలు మరొకరు అర్ధం చేసుకోవడం. గంటల తరబడి మాట్లాడటానికి కుదరకపోవచ్చు.. అలాంటప్పుడు రోజులో కొద్దిసేపైనా సమయం కేటాయించాలి. బిజీ లైఫ్, తన పరిస్ధితిని భాగస్వామికి వివరించాలని శ్రేయా ఘోషల్ తెలిపారు.
తాను దూరంగా ఉన్నందుకు శిలాదిత్య తనను ఎప్పుడూ అపరాధ భావానికి గురిచేయలేదు. నువ్వు ఇక్కడ ఎందుకు ఉండవు? అని ఎప్పుడూ నన్ను అడగలేదు. నేను ఎంతో అదృష్టవంతురాలిని.. నాకు మంచి భర్త దొరికాడు. ఆయనే ఇల్లంతా చక్కబెడతాడు. అతను ఇష్టానుసారం జీవించడానికి ఇష్టపడతాడు కాబట్టి.. తన గిన్నెలు తానే కడుక్కుంటాడు, వంటగదిని కూడా శుభ్రం చేసుకుంటాడు. ఒకవేళ నేను ఆ పనులు చేస్తానన్నా నా మీద కోప్పడతాడు. బిజీ కెరీర్ కారణంగా తరచుగా ఇంటి బాధ్యతలను పంచుకోవాల్సి వస్తోంది. ఇది మా వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. నేను కొన్నిసార్లు నెలల పాటు ఇంట్లో ఉండను.. మేము డేటింగ్ మొదలెట్టిన నాటి నుంచి ఆయన నిశ్చింతగానే ఉండేవాడు. మా ఇద్దరి మధ్య ఎలాంటి ఈగోలు లేవు.. చాలా విషయాల్లో మా ఇద్దరి మధ్య పోలికలు ఉన్నాయని శ్రేయా ఘోషల్ తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా.. అభిమానులు వీరిద్దరి రిలేషన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications
