SIRలో తీసేసిన ఓటర్లను మళ్లీ చేరిస్తే జైలుకే ? ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టిన మాజీ సీఈసీ..!
దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్) నిర్వహించి ఏకంగా 13 కోట్ల మందిని ఓటర్లుగా తొలగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తప్పిదాలకు బాధ్యత వహిస్తూ పదవి నుంచి సీఈసీ జ్ఞానేష్ కుమార్ తప్పుకోవాలంటూ కాక్రోచ్ జనతా పార్టీతో పాటు విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈసీ తప్పుదిద్దుకునేందుకు మరో ఉత్తర్వు ఇచ్చింది. ఇప్పుడు అది కూడా వివాదాస్పదమవుతోంది. ఇందులో ఈసీ ఎస్ఐఆర్ పూర్తయిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తీసేసిన ఓటర్లను ఫామ్ 6 ఇస్తే తిరిగి చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టేలా ఆదేశాలు ఇచ్చింది. ఇది చట్టవిరుద్ధమని, అలా చేస్తే జైలుశిక్ష తప్పదని మాజీ సీఈసీ ఎస్ వై ఖురేషీ వెల్లడించారు.
ప్రత్యేక ఓటర్ల జాబితాలో ఒకసారి తొలగించిన ఓటర్లను తిరిగి ఫామ్ 6 ద్వారా ఓటరు జాబితాల్లోకి చేర్చేందుకు అవకాశం లేదని మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ (Former CEC) ఎస్ వై ఖురేషీ (S.Y. Quraishi) తేల్చిచెప్పారు. తొలగించబడిన ఓటరు ఫారం 6ను పూరించలేరని ఆయన ఇవాళ స్పష్టం చేశారు. ఇది కేవలం కొత్త ఓటర్ల కోసం మాత్రమే అన్నారు. దీన్ని పూరించమని బలవంతం చేసిన వారందరూ ఒక సంవత్సరం జైలు శిక్ష పడే నేరానికి పాల్పడినట్లే అని మాజీ సీఈసీ తెలిపారు. వారిని బలవంతం చేసిన ఈసీ అధికారులు నేరానికి సహకరించినవారే అవుతారన్నారు. కాబట్టి ఈ పత్రికా ప్రకటన ఈసీ అలా చేసేందుకు సహకారాన్ని అందిస్తున్నట్లు స్పష్టం చేస్తోందన్నారు.

Form6 can’t be filled by a deleted voter. It’s only for NEW voters. All those who have been forced to fill it have committed criminal offence carrying 1 yr prison. EC officials who forced them are abetters to crime. This press note shows ECI’s abetment! pic.twitter.com/ga7FEjJoAG
— Dr. S.Y. Quraishi (@DrSYQuraishi) October 2, 2026
ఎస్ఐఆర్ ప్రక్రియ సందర్భంగా ఎన్నికల కమిషనర్లు ఫామ్ 6లో మార్పులకు సంబంధించి పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా సీఈసీ జ్ఞానేష్ కుమార్ పట్టించుకోకుండా ముందుకెళ్లారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తన కథనంలో బయటపెట్టింది. దీంతో ఫామ్ 6 వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇప్పుడు భారీ ఎత్తున ఓటర్లను తొలగించారని తేలడంతో వారందరినీ తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలన్న ఒత్తిడి ఈసీపై పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఫామ్ 6 ద్వారా వారందరినీ తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని ఈసీ అదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు చెల్లవని, అలా చేస్తే జైలు శిక్ష తప్పదని మాజీ సీఈసీ ఎస్ వై ఖురేషీ చెప్తున్నారు. మరి ఈ విషయంలో ఈసీ తన ఆదేశాలు సవరించుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. అలాగే ఈసీ అలాగే ముందుకెళ్తే ఆ తర్వాత దాఖలయ్యే కేసుల్ని ఎదుర్కోక తప్పదు.















Click it and Unblock the Notifications
