కోడలికి హైకోర్టు షాక్.. అత్తమామల కోసం సంచలన నిర్ణయం!
భర్త మరణం తర్వాత కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం పొంది ఆ తర్వాత అత్తమామలను పట్టించుకోకుండా వదిలేసిన ఓ మహిళకు రాజస్థాన్ హైకోర్టు షాకిచ్చింది. బాధితురాలైన అత్తమామలకు ఆమె జీతం నుంచి ప్రతి నెలా 25 శాతం సొమ్మును నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయాలని విద్యుత్ సంస్థను న్యాయస్థానం ఆదేశించింది. 2017లో ఉద్యోగం పొందే సమయంలో ఇచ్చిన అఫిడఫిట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను హైకోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది.
అజ్మీర్ విద్యా నిగమ్‌కు ఆదేశాలు
ఈ కేసుకు సంబంధించి అజ్మీర్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్‌ను ఆదేశించిన హైకోర్టు.. సదరు మహిళకు వచ్చే నెలసరి జీతంలో 25 శాతాన్ని నేరుగా ఆమె అత్తగారి బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని పేర్కొంది. అంతేకాకుండా మరణించిన ఉద్యోగికి సంబంధించి రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, తదితర ఆర్థిక ప్రయోజనాలు కూడా భార్య, ఉద్యోగి తల్లి మధ్య సమానంగా పంపిణీ చేయాలని స్పష్టం చేసింది.

అఫిడవిట్ ఇచ్చి ఉద్యోగం.. ఆపై రెండో పెళ్లి!
బాధితుల కథనం ప్రకారం.. 2017లో భర్త మరణించిన అనంతరం అత్తమామల సంరక్షణ, పోషణ బాధ్యతలను పూర్తిగా చూసుకుంటామని సదరు మహిళ అఫిడవిట్ రాసిచ్చి కారుణ్య నియామకం కింద ఉద్యోగంలో చేరింది. అయితే ఉద్యోగం వచ్చిన కొద్దికాలానికి ఆమె అత్తమామలను వదిలేసి వేరుగా నివాసం ఉండటం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా మొదటి భర్త ద్వారా వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే ఆమె మరొకరిని వివాహం చేసుకుంది.
కోర్టును ఆశ్రయించిన అత్త
కొడుకు మరణంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పటికీ.. కోడలు తమను ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో మరణించిన ఉద్యోగి తల్లి రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించింది. 2017లో కుటుంబ సభ్యులందరూ చర్చించుకుని, అత్తమామల బాధ్యతను చూసుకుంటుందనే నమ్మకంతోనే ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించామని, కానీ ఆమె హామీని విస్మరించి తమను అనాథలుగా వదిలేసిందని పిటిషన్లో పేర్కొన్నారు.
కారుణ్య నియామకం వ్యక్తిగత ప్రయోజనం కాదు: స్పష్టం చేసిన హైకోర్టు!
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన రాజస్థాన్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకం ముఖ్య ఉద్దేశం ఉద్యోగి ఆకస్మిక మరణంతో ఆ కుటుంబం ఎదుర్కొనే తక్షణ ఆర్థిక సంక్షోభాన్ని తీర్చడమేనని.. ఇది కేవలం భార్య వ్యక్తిగత ప్రయోజనంగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. ఇక్కడ కుటుంబం అంటే కేవలం భార్య ఒక్కటే కాదని.. మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు కూడా అందులోకి వస్తారని వ్యాఖ్యానించింది. ఇచ్చిన హామీ ఆధారంగానే ఉద్యోగం పొందినందున బాధ్యతల నుంచి ఆమె తప్పుకోలేరని కోర్టు స్పష్టం చేసింది.













Click it and Unblock the Notifications
