టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదు; ఇడుపులపాయకు వస్తే తేల్చుకుందాం; సిద్ధమా జగన్: అచ్చెన్నాయుడు సవాల్
ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జగన్ సర్కార్ పై, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఓటేసి ప్రజలు తప్పు చేశారని ఆయన మండిపడ్డారు. జగన్ ఎలాంటి వారో తెలిసి, ఆయన చరిత్ర తెలిసి మరీ ప్రజలు ఓటేశారని అచ్చెన్నాయుడు అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ ని లేకుండా చేయడం కోసం వైసీపీ చాలా ప్రయత్నాలు చేస్తోందని, అడుగడుగున విఫలమవుతుంది అంటూ తేల్చి చెప్పారు.

జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి ప్రజలు ఓట్లేశారు
జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి ప్రజలు ఓట్లు వేయడం అంటే ప్రజలు చేసిన తప్పు కాక మరేమిటి అంటూ ప్రశ్నించిన అచ్చెన్నాయుడు చంద్రబాబు కంటే ఏదోఎక్కువ మంచి చేస్తారని ప్రజలు ఓట్లు వేశారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాడేమో.. మనం ఏమైపోతామో అంటూ, రాజకీయంగా నిలబడగలమా లేదా అని భయపడ్డానని, కానీ సీఎం జగన్ ఏమీ చేయలేదని మాట తప్పారని, మడమ తిప్పారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వైసీపీ తరహాలో గాలికి పుట్టి గాలికి పెరగలేదని అచ్చెన్నాయుడు వెల్లడించారు.

పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వైసీపీ నేతలకు సిగ్గు లేదా?
దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడి చేయడానికి వైసీపీ నేతలకు సిగ్గు లేదా అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలో ప్రారంభించిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో ఏదో స్కామ్ జరిగిందని వెతికి వెతికి వేసారి పోయారని ఎద్దేవా చేశారు. ఎంత వెతికినా ఏమీ దొరకలేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సీమెన్స్ ప్రాజెక్టు వస్తే రాష్ట్రానికి తెచ్చామని ముప్పై మూడు వందల కోట్ల రూపాయల అంచనాలతో సీమెన్స్ ప్రాజెక్ట్ రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత తమదేనని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు .

సీమెన్స్ లో ఏదో స్కాం జరిగిందని తప్పుడు ప్రచారం
90 శాతం ఈ ప్రాజెక్టుకు సీమెన్స్ కంపెనీనే ఖర్చు భరించాలని, 10 శాతం ప్రభుత్వం ఖర్చు చేసేలా ఒప్పందం జరిగిందని అచ్చెన్నాయుడు వెల్లడించారు. దిక్కుమాలిన ముఖ్యమంత్రి రెండున్నర సంవత్సరాలలో ఇటువంటి ప్రాజెక్టు ఒకటైన తీసుకువచ్చారా అంటూ ప్రశ్నించారు. ఇక ఇదే సమయంలో ఒక ప్రైవేటు యాడింగ్ కంపెనీ ద్వారా ఆడిట్ చేయించి ఒక్క ఐటమ్ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్లకపోయినా, డబ్బులు చెల్లించారని సిఐడితో తప్పుడు కేసులు పెట్టించారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇక ఆ డబ్బంతా మాకు దొరికిందని సింగపూర్ వెళ్లిందని అబద్ధపు రాతలు రాయించారు అంటూ నిప్పులు చెరిగారు.

ఇడుపులపాయకు రా జగన్ .. అక్కడ తేల్చుకుందాం అంటూ సవాల్
40 సెంటర్లలో ఒక ఐటమ్ కూడా లేదని చెప్తున్నారని మండిపడిన అచ్చెన్నాయుడు జగన్ కు దమ్ముంటే ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో సీమెన్స్ పెట్టిన వస్తువులన్నీ ఉన్నాయో లేదో వెరిఫై చేసేందుకు నాతో వస్తారా అంటూ సవాల్ విసిరారు. శిక్షకు మేము సిద్ధపడతాం .. ఐటమ్స్ ఉంటే మేము చెప్పిన శిక్షకు సిద్ధపడతావా అంటూ అచ్చెన్నాయుడు జగన్ కు సవాల్ చేశారు.పేదల అభ్యున్నతి కోసం శ్రామికుల చెమటలో నుంచి పుట్టిన పార్టీ టీడీపీ అని గుర్తు చేసిన ఆయన తెలుగుదేశం పార్టీని నాశనం చేయడం, ఇబ్బంది పెట్టడం నీ వల్లే కాదు నీ ముత్తాత, తాత, తండ్రి వల్ల కూడా కాదని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు పేదరికాన్ని నిర్మూలించేందుకు పని చేశామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పట్ల ఉద్యమాలు చేశామని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు.
Recommended Video

జగన్ సీఎం కావటం ఏపీ దౌర్భాగ్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం దౌర్భాగ్యమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రెండున్నరేళ్ళ వైసీపీ పాలనలో టిడిపి నాయకులు, కార్యకర్తలకు ఎన్ని సమస్యలు, ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని అధికారంలోకి రావడానికి కృషి చేస్తున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుల త్యాగం తెగువ మర్చిపోలేనిదని అచ్చెన్నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications