అమరావతికి ఆస్ట్రేలియా గుడ్ న్యూస్..!
ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, రాజధాని అమరావతిలో తిరిగి పనులు ప్రారంభమైన నేపథ్యంలో వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. ఇప్పటికే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉండగా అమరావతిలో ప్రాజెక్టులకు ఆసక్తి చూపిన సంస్థలు, కొంత మేర పనులు మొదలుపెట్టి ఆ తర్వాత ఆపేసిన సంస్థలు కూడా ఇప్పుడు రాజధానికి క్యూ కడుతున్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు విదేశీ సంస్థలు కూడా రాజధానిలో అవకాశాలపై ఆరా తీయడం మొదలుపెట్టాయి.
అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అలాగే అభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చించేందుకు ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సిలై జాకీ నేతృత్వంలోని బృందం పర్యటించింది. సీఆర్డీయే కొత్త కమిషనర్ కాటమనేని భాస్కర్ తో ఈ బృందం చర్చలు జరిపింది. అమరావతిలో పెట్టుబడులు పెడితే ఉన్న వాణిజ్య అవకాశాలపై వీరు కీలక చర్చలు జరిపారు. ప్రభుత్వం వైపు నుంచి తమకు ఎలాంటి సహకారం ఉంటుందన్న దానిపైనా వారు ఆరా తీశారు.

రాజధాని ప్రాంతంగా అమరావతిని గతంలో గుర్తించినప్పటికీ అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, కొన్ని భవనాలు మాత్రమే నిర్మించి వదిలేయడంతో స్వదేశీ, విదేశీ పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులపై అభద్రతాభావంలో ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం పూర్తిగా అమరావతికి మద్దతుగా ఉండటంతో భవిష్యత్తుపై భరోసాతో వారు తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి మాత్రం అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని, మాస్టర్ ప్లాన్ తో పాటు అన్ని రకాల అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ కు సీఆర్డీయే కమిషనర్ భాస్కర్ వివరించినట్లు తెలుస్తోంది. అమరావతిలో తగినంత భూమి అందుబాటులో ఉందని, పెట్టుబడులు పెడితే ప్రయోజనం ఉంటుందని హామీ ఇచ్చారు. తమకు ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహాలు లభిస్తే విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తదుపరి చర్చల్లో దీనిపై క్లారిటీ రానుంది.












Click it and Unblock the Notifications