విజయవాడలో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ-25 వేలు సహా డిమాండ్లు ఇవే..!
ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తెచ్చింది. దీంతో మహిళలు సంతోషంగా ఉన్నా ఈ పథకం ప్రభావం ఆటో డ్రైవర్లపై తీవ్రంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లు తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఉచిత బస్సు పథకం నేపథ్యంలో తమకు కొత్త పథకం అమలుచేస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ ఇవాళ విజయవాడలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ చేపట్టారు.
బడా పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇచ్చే పాలకులు ఆటో కార్మికులకు ఎందుకు ఇవ్వరంటూ ఇవాళ విజయవాడలో నిర్వహించిన భారీ ర్యాలీ పాల్గొన్న ఆటో డ్రైవర్లు ప్రశ్నించారు. బడా కంపెనీల యాప్ లు, గ్యాస్, ఇన్సూరెన్స్ రేట్ల పెంపు, పోలీసు, రవాణా శాఖల పెనాల్టీలతో ఆటో రంగం కుదేలైందని వారు తెలిపారు. ఈ మేరకు నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో భారీ ఎత్తున ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ప్రదర్శన అనంతరం ధర్నా నిర్వహించారు.

ఉచిత బస్సు సదుపాయంతో రోడ్డున పడ్డ ఆటో కార్మికులందరికీ 25 వేలు ఆర్థిక సహాయం అందించాలని, వడ్డీ లేని ఆటో రుణాలు ఇవ్వాలని, ఓలా, ఉబర్, రాపిడో వంటి సంస్థల దోపిడీని అరికట్టాలని, ఆటో గ్యాస్, ఇన్సూరెన్స్ రేట్లలో రాయితీలు కల్పించాలని, పోలీసు, రవాణా శాఖ పెనాల్టీలను పెంచిన జీవో 21 రద్దు చేయాలని ఆటో డ్రైవర్లు కోరారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆటో కార్మికులను ఆదుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఉచిత బస్సు పథకానికి ఎవరు వ్యతిరేకం కాదని, కానీ స్త్రీ శక్తి పథకం, ఆటో కార్మికుల్ని ఆదుకునే సంక్షేమ పథకం కలగలిపి అమలు జరపాలని వారు కోరారు. స్త్రీ శక్తి అమలుతో పాటే ఆటో కార్మికుల సంక్షేమానికి పథకం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి మాట ఇచ్చి, తప్పారని వారు ఆరోపించారు. ఎన్నికలలో కూటమి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, వాహన మిత్ర మొత్తాన్ని పెంచుతామని, పెనాల్టీలు వేసే జీవో 21 రద్దు చేస్తామని, రుణాలు అందిస్తామని హామీలు ఇచ్చారని,ఖాకీ చొక్కా వేసుకుని ఆటో తోలి కార్మికులకు అండగా నిలుస్తామని నాడు మాట ఇచ్చిన నేతలు మోసం చేయటం తగదన్నారు.
రాష్ట్రంలో లక్షలాదిమంది కుటుంబాలు ఆటో, క్యాబ్ ల పై ఆధారపడ్డాయని, ఉపాధి కల్పిస్తున్నారనే పేరుతో బడా పారిశ్రామికవేత్తలకు.. భూములు, రుణాలు, విద్యుత్, ఇతర పనులలో రాయితీలు కల్పిస్తున్న ప్రభుత్వం లక్షల మందికి ఉపాధి చూపే ఆటో రంగానికి ఎందుకు ఇవ్వరని వారు ప్రశ్నించారు. ఇప్పటికే ఓలా, ఉబర్, రాపిడో వంటి బడా సంస్థల దోపిడీతో ఆటో కార్మికులు నాశనమయ్యారన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆటో సిఎన్జి గ్యాస్, డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచి ఆటో, మోటార్ రంగాన్ని కుదేలు చేశారన్నారు.

వంద రూపాయలు ఉన్న సాధారణ పెనాల్టీలు వెయ్యి రూపాయలకు పెంచేశారని, ఉచిత బస్సుతో కిరాయిలు లేక ఆటో కుటుంబాలు జీవనం సాగించడమే కష్టంగా మారిందని, కార్మిక కుటుంబాలు బజారున పడ్డాయని వారు ఆరోపించారు. ఆటోలకు తీసుకున్న రుణాల కిస్తీలు కట్టలేక ఆటోలు స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. ఆటో కార్మికులకు పథకం ప్రకటిస్తానన్న నేతలు మొహం చాటేస్తున్నారన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం హామీ అమలుచేసినట్లే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. పి ఫోర్, పేదరిక నిర్మూలనంటూ గొప్పగా చెబుతున్న కూటమి ప్రభుత్వం నిరుపేదలైన ఆటో కార్మికులను దెబ్బతీయటం సమంజసమా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications