శాడిస్ట్, తుగ్లక్.. వైఎస్ జగన్ , ధూళిపాళ్ళనేనా..వారిని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు: అయ్యన్న పాత్రుడు ధ్వజం
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ధూళిపాళ్ళ నరేంద్ర అరెస్టుపై భగ్గుమన్న టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు శాడిస్టు ,తుగ్లక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎవరో ఒకరిని అరెస్టు చేయించడం, అద్దంలో చూసుకుని ఆనంద పడడం అలవాటైపోయింది అని మండిపడ్డారు. ధూళిపాళ్ళ నరేంద్ర అరెస్టుతో ముఖ్యమంత్రి శాడిస్టిక్ మెంటాలిటీ అందరికీ అర్థమైందని ఆయన విమర్శించారు.

ధూళిపాళ్ల నరేంద్ర చేసిన నేరం అదేనా .. శాడిస్టు ముఖ్యమంత్రి
సంగం డెయిరీని కంపెనీ యాక్ట్ పరిధిలోకి తీసుకురావడమే ధూళిపాళ్ల నరేంద్ర చేసిన నేరమా అంటూ నిలదీసిన అయ్యన్నపాత్రుడు ఆ పని నల్గొండ డెయిరీ , విశాఖ డెయిరీ నిర్వాహకులు కూడా చేశారని వారిని ఎందుకు ఈ శాడిస్టు ముఖ్యమంత్రి అరెస్టు చేయించలేదు అంటూ నిలదీశాడు. ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబానికి ప్రజల్లో ఎంతటి ప్రేమాభిమానాలు ఉంటే ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తాడని గుర్తు చేశారు అయ్యన్నపాత్రుడు.

విశాఖ , నల్గొండ డెయిరీలు కంపెనీ యాక్ట్ లోకి రావడం తప్పు కానప్పుడు సంగం డెయిరీది తప్పెలా ?
విశాఖ డెయిరీ , నల్గొండ డెయిరీలు కంపెనీ యాక్ట్ లోకి రావడం తప్పు కానప్పుడు, సంగం డెయిరీని కంపెనీ యాక్ట్ పరిధిలోకి తీసుకురావడం తప్పు ఎలా అవుతుంది అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు అయ్యన్నపాత్రుడు . విశాఖ డెయిరీ నిర్వాహకులు వైసిపి నాయకులనా , లేక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్రలో భోజనాలు , మంచి నీళ్లు, మజ్జిగ పంపిణీ చేశారనా వారిని అరెస్టు చేయలేదంటూ ప్రశ్నించారు.

జగన్ ఏది చెప్తే అది నమ్మి అరెస్ట్ చేస్తారా ?
సంగం డెయిరీ తరఫున ఒక ట్రస్టు ఏర్పాటు చేసి , ఆసుపత్రి నిర్మించి, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని చూడడమే నరేంద్ర చేసిన తప్పా అని ప్రశ్నించిన అయ్యన్నపాత్రుడు, తప్పు చేసిన వారిని అరెస్టు చేయాలి కానీ , మంచి పేరున్న ధూళిపాళ్ల నరేంద్ర వంటివారినా అరెస్ట్ చేసేది అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక ఏసీబీ, సిఐడి విభాగాలు స్వతంత్ర సంస్థలని మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు అయ్యన్నపాత్రుడు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది విని ఆధారాలు లేకుండా , మంచి చెడూ ఆలోచించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తారా అంటూ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ధూళిపాళ్ళ నరేంద్ర అరెస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications