మామూలే, వారిని పట్టించుకోను: బాలకృష్ణ, రోజా అరెస్టు, 144 సెక్షన్
హైదరాబాద్/చిత్తూరు: ప్రతిపక్షాల విమర్శలను తాను పట్టించుకోనని హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ బుధవారం అన్నారు. ఆయన సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడును ఉదయం కలిశారు.
హిందూపురం అభివృద్ధి పైన చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతిపక్షాల విమర్శలు సాధారణమేనని, వాటిని తాను పట్టించుకోనని చెప్పారు. హిందూపురం సహా అనంతపురం అభివృద్ధికి తాను కృషి చేస్తానని చెప్పారు. త్వరలో హిందూపురంకు నీళ్లు తీసుకు వస్తానని చెప్పారు.
హిందూపురంలో స్టేడియంను నిర్మిస్తామని చెప్పారు. ఈ విషయమై మంత్రి అచ్చెన్నాయుడుతో ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడారు. హిందూపురం స్టేడియాన్ని పిపిపి పద్ధతిలో నిర్మిస్తామని బాలకృష్ణ తెలిపారు. సాంస్కృతికి, పర్యాటక, క్రీడల పరంగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

జగన్ 29న బంద్ మానుకో: సోమిరెడ్డి
ఈ నెల 11వ తేదీన బందు నిర్వహించినందున ఈ నెల 29వ తేదీన తలపెట్టిన బందును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బందులతో అభివృద్ధికి ఆటంకం అని చెప్పారు.
యనమలను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు
ఏపీ ఉద్యోగ సఘాల నేతలు బుధవారం నాడు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడును కలిశారు. ఉద్యోగుల సమస్యలు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పైన వారు చర్చించారు. అదేవిధంగా విజయవాడకు ఉద్యోగుల తరలింపుపై చర్చించారు.
రోజా అరెస్ట్
కడప జిల్లాలోని నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటనకు నిరసనగా వైసీపీ పిలుపిచ్చిన బంద్ చిత్తూరు జిల్లా నగరిలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మెల్యే రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరిలో పోలీసులు ముందుగానే 144 సెక్షన్ విధించారు.
వైసిపి నేతలు నిరసనలకు దిగే యత్నం చేశారు. ఈ క్రమంలో రోజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోజాకు మద్దతుగా నిలిచిన ఆ పార్టీ సీనియర్ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మరో ఎమ్మెల్యే నారారణస్వామిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కూడా పోలీసులు చిత్తూరులోనే అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications