బొత్సపై నిప్పులు చెరిగిన బాలయ్య: తరిమికొట్టాలని..
శ్రీకాకుళం/చిత్తూరు: కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణపై సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం చిలకపాలెం కూడలిలో మంగళవారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బొత్స సత్యనారాయణ కుటుంబం అవినీతి మయమైందని, అలాంటి వ్యక్తులను విజయనగరం జిల్లా నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
తెలుగుజాతి ఉనికిని కాపాడుకునేందుకు ఇదే సరైన సమయమని, వచ్చే ఎన్నికల్లో సమర్థుడైన నేతను ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన అన్ని హామీలను టిడిపి నెరవేరుస్తుందని అన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంచి ఆర్థిక నిపుణుడని, అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే ప్రజలకు హామీలు ఇచ్చినట్లు తెలిపారు.
తమపై ఆరోపణలు చేస్తున్నవారు 420 కేసుల్లో నిపుణులని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం టిడిపి వల్లే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. బాలకృష్ణ రోడ్‌షోలో శ్రీకాకుళం ఎంపి అభ్యర్థి కె రామ్మోహన్ నాయుడు, విజయనగరం పార్లమెంటు అభ్యర్థి అశోక్ గజపతిరాజు, ఎచ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కళా వెంకట్రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి నారాయణ మూర్తి పాల్గొన్నారు.

కాంగ్రెస్, జగన్ పార్టీలది అవినీతి జట్టు: చంద్రబాబు
చిత్తూరు: భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలది అభివృద్ధి జట్టయితే.. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవినీతి జట్టని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. దేశం బాగుపడాలంటే బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో స్మగ్లర్లు, దోపిడీదారులకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. వైకాపా అధ్యక్షుడు వైయస్ జగన్ అధికారంలోకి వస్తే సీమాంధ్రలో జైలు గోడలు వెలుస్తాయని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాళహస్తిని మోడరన్ టౌన్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి రాజగోపురాన్ని పునర్నిర్మించే సత్తా టిడిపికే ఉందని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications