బండి సంజయ్- సోము వీర్రాజులకు కీలక పదవులు..!!
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ కార్యవర్గాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణల్లో పార్టీలో సంస్థాగత మార్పులను చేపట్టింది బీజేపీ అధిష్ఠానం. రెండు చోట్లా పార్టీ అధ్యక్షులను తొలగించింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించింది. తెలంగాణ అధ్యక్ష బాధ్యతలను కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి- ఏపీలో పార్టీ పగ్గాలను కేంద్ర మాజీమంత్రి డీ పురంధేశ్వరికి అప్పగించింది.
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతోండటం, ఏపీలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక పోరును దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధిష్ఠానం- సంస్థాగత మార్పులను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ పార్టీ రాష్ట్ర శాఖ కార్యవర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేయబోతోంది. కొత్త ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు రాబోతోన్నారు.

ఇక- ఈ మార్పులు చేర్పుల వ్యవహారంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి తగిన ప్రాధాన్యతను ఇచ్చింది. పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యుడిగా అపాయింట్ చేసింది. కొద్దిరోజుల కిందటే కిరణ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారాయన.

అదే సమయంలో ఏపీ, తెలంగాణ పార్టీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు, బండి సంజయ్‌లకూ తాజాగా పార్టీ పరంగా కీలక పదవులను ఇచ్చింది బీజేపీ అధిష్ఠానం. వారిద్దరిని కూడా జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యులుగా నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.

వారితోపాటు మరో ఎనిమిది మంది సీనియర్ నాయకులను కూడా జాతీయ కార్యవర్గ కమిటీలోకి తీసుకుంది. సురేష్ కశ్యప్, డాక్టర్ సంజయ్ జైస్వాల్, విష్ణుదేవ్ సాయ్, ధరమ్‌లాల్ కౌశిక్, అశ్విని శర్మ, దీపక్ ప్రకాష్, కిరోడీలాల్ మీనా, డాక్టర్ సతీష్ పునియాలను కార్యవర్గ కమిటీ సభ్యులుగా నియమించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది.












Click it and Unblock the Notifications