బస్సు ప్రమాదం: డోర్‌లాక్‌తో తప్పించుకోలేకపోయారు
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించినవారు ఎక్కువ మంది కర్ణాటక రాజధాని బెంగళూర్‌కు చెందినవారని అంటున్నారు. జబ్బర్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో బస్సు నడుస్తున్నప్పటికీ రిజిస్ట్రేషన్ మాత్రం దివాకర్ ట్రావెల్స్ మీద ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యమే బస్సు ప్రమాదానికి కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. బస్సు డ్రైవర్ ఫిరోజ్ నుంచి పోలీసులు ప్రమాదం వివరాలను సేకరిస్తున్నారు.
డ్రైవర్ అతి వేగంగా బస్సును నడపడం వల్ల అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని, దాంతో డీజిల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయని చెబుతున్నారు. డ్రైవర్, క్లీనర్‌లతో పాటు ఐదుగురు ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. డోర్‌లాక్ చేసి ఉండడం వల్ల కూడా ప్రయాణికులు తప్పించుకోలేకపోయారని అంటున్నారు. అంతేకాకుండా తెల్లవారు జాము కావడంతో చాలా మంది నిద్రలో ఉండడం వల్ల కూడా తప్పించుకోలేకపోయారని అంటున్నారు.

బస్సు ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఘటనపై మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ నుంచి, ఎస్పీ నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నివేదికను కోరారు. బస్సులో ప్రయాణిస్తున్న 29 మంది పేర్లు తమకు జబ్బర్ ట్రావెల్స్ కార్యాలయం నుంచి అందాయని ఎస్పీ నాగేంద్ర కుమార్ చెప్పారు. మృతుల బంధువులకు వివరాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రమాదం జరిగిన స్థలాన్ని మంత్రి డికె అరుణ పరిశీలించారు. బస్సు బయలుదేరిన తర్వాత మార్గమధ్యంలో ఎక్కినవారి వివరాలు కూడా అందాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఆమె చెప్పారు.
బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కూడా బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications