చదువు ఒత్తిడి: విశాఖలో బిబిఎం విద్యార్థిని ఆత్మహత్య

తనకు బిఏ చదవాలని ఉందని, తన నుంచి తల్లిదండ్రులు ఎక్కువగా ఆశించారని, తన వల్ల కావడం లేదని సూసైడ్ నోట్‌లో బాధితురాలు పేర్కొంది. ఇప్పటికే తన కోసం ఎంతో చేశారని, తనను క్షమించాలని తన తల్లిదండ్రులను కోరుతున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నంలో నివాసముంటున్న కేశబోయిన శోభనాద్రి వాణిజ్య పన్నుల శాఖలో సహాయ కమిషనర్, ఆయన భార్య ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో వైద్యురాలుగా పని చేస్తోంది. వారి కూతురు శ్వేత (19) బిఏ చదవాలని అనుకుంది.
కానీ, శ్వేత తల్లిదండ్రులు మాత్రం ఆమెను ఐఐటి చదించాలని ఆశించారు. వారి కోరిక మేరకు శ్వేత రెండు సార్లు ఐఐటి జెఈఈ ఎంట్రన్స్ రాసినా ఎంపిక కాలేదు. దీంతో ఒత్తిడికి గురైన శ్వేత మానసికంగా కుంగిపోయింది. కుమార్తె పరిస్థితిని గమనించిన తండ్రి శోభనాద్రి ఆమెకు హైదరాబాద్‌లోని ఓ సైకాలజిస్ట్ వద్ద పలుమార్లు కౌన్సెలింగ్ ఇప్పించారు. ఆ తర్వాత శ్వేత కోరిన బిఏ కాకుండా విశాఖలోని ఓ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (బిబిఎం)లో జాయిన్ చేశారు.
ప్రస్తుతం బిబిఎం మొదటి సంవత్సరం చదువుతున్న శ్వేత, ఆదివారం అర్ధ రాత్రి సూసైడ్ నోట్ రాసి తమ అపార్ట్‌మెంటు నాల్గవ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ శబ్ధానికి మేల్కొన్న వాచ్‌మెన్ వెంటనే శోభానాద్రికి సమాచారం అందించాడు. కాగా శోభానాధ్రికి అక్కిడి చేరుకునే లోపే శ్వేత తన ప్రాణాలను వదిలింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని కెజిహెచ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications