కాపు రిజర్వేషన్లతో బీసి రిజర్వేషన్లు తగ్గవు, కమిషన్ ఏర్పాటు: యనమల
హైదరాబాద్: కాపు రిజర్వేషన్లపై కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మంత్రి వర్గ సమావేశానంతరం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మీడియా సమావేశంలో సోమవారం సాయంత్రం వెల్లడించారు. రెండు రోజుల్లో కమిషన్ చైర్మన్‌ను నియమిస్తామని ఆయన చెప్పారు.
కమిషన్ చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తిని వేస్తామని ఆయన చెప్పారు. 9 నెలల్లో కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని ఆయన చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల బీసీ రిజర్వేషన్లేమీ తగ్గవని, యథాతథంగా ఉంటాయని ఆయన చెప్పారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలనే ఆలోచనను బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆయన ఆ వివరణ ఇచ్చారు.

పరిశ్రమలకు 99 ఏళ్ల పాటు భూములను లీజుకు ఇవ్వడం గానీ పూర్తిగా విక్రయించడం గానీ జరుగుతుందని ఆయన చెప్పారు. ఎపి కోస్తా ప్రాంతాల అభివృద్ధికి మారిటైమ్ బోర్డును ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.నాయి బ్రాహ్మణులకు, రజకులకు ప్రత్యేక ఫెడరేషన్ల ఏర్పాటు చేసే ఆలోచన ఉందని ఆయన చెప్పారు. బలహీనవర్గాల కోసం చంద్రన్న ఆదరణ పథకం అమలు చేస్తామని చెప్పారు.
జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జన్మభూమి కార్యక్రమం ఉంటుందని మరో మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. డిసెంబర్ 1 నుంచి 14వ తేదీ వరకు జనచైతన్య యాత్రలు నిర్వహిస్తామని చెప్పారు.

కర్నూలు, అనంతపురం అర్బన్ డెవలప్‌మెంట్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. రాజమండ్రి, కాకినాడల్లో కూడా అర్బన్ డెవలప్‌మెంట్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications