బాలయ్యపై పోటీగా బీసీ మహిళ: హిందూపురంలో బాలకృష్ణను ఓడించి తీరుతాం: మంత్రి పెద్దిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకరిపై ఒకరి విమర్శనాస్త్రాలను సంధించుకుంటూ అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు కాక పుట్టిస్తున్నారు. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను ఓడించి తీరుతామని ఆయన పేర్కొన్నారు.
Recommended Video

హిందూపురం నియోజకవర్గం మానెపల్లి గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల హామీలను నెరవేర్చలేదని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో జనం సంతోషంగా ఉన్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 99 శాతం లబ్ధిదారులకు పథకాలు అందజేశామని ఆయన తెలిపారు.

సీఎం జగన్ వెనుకబడిన వర్గాల వారికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వారికి స్థానం కల్పిస్తున్నారని తెలిపారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని, హిందూపురం పార్లమెంటు నుంచి బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన శాంత బరిలో ఉంటారని ఆయన తెలిపారు. ఒకే చోట వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలకు ఏ పార్టీ అవకాశం ఇవ్వలేదని వైసీపీ మాత్రమే ఆ పని చేసిందన్నారు.
హిందూపురంలో బాలకృష్ణను కచ్చితంగా ఓడించి తీరుతామని చెప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో చంద్రబాబుకు ఓటమి తప్పదు అన్నారు. ఇక వైసిపి లో ఉన్న టికెట్ల కేటాయింపులో ఉన్న అసంతృప్తిని త్వరలోనే అధిగమిస్తామని పార్టీ శ్రేణులను ఏకతాటి మీద ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు టిడిపి జనసేన తరఫున ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా స్పష్టత రాలేదన్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయిందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికలలో ఓటు బ్యాంకును చీల్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రలన్నింటిని అధిగమిస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలలో తాము సచివాలయ సిబ్బందిని ఉపయోగించడం లేదని పేర్కొన్న ఆయన, ఏమాత్రం అవగాహన లేకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈసీ కి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. నిజమైన రాయలసీమ ద్రోహి ఎవరు అంటే అది చంద్రబాబునాయుడునే అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications