రోజా టు విప్.. బాబు చేతిలో చిత్తు: జగన్‌కు సలహాదారుల షాక్?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు అసెంబ్లీలో తిరగబడ్డట్లుగానే చెప్పవచ్చు. తన పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం నుంచి అవిశ్వాసం వరకు జగన్ తప్పులో కాలేసినట్లుగా చాలామంది అభిప్రాయపడుతున్నారు.
రోజా పైన సస్పెన్షన్ వ్యవహారం విషయంలో సభకు వెళ్లకపోవడం, బలం లేదని తెలిసిన ఒకటికి రెండుసార్లు అవిశ్వాసం పెట్టడం, పదేపదే విప్‌లు జారీ చేయడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యల కోసం ద్రవ్యవినిమయ వినిమయ బిల్లును ఉపయోగించుకోవడం సరికాదంటున్నారు.
తొలిసారి ప్రభుత్వం పైన అవిశ్వాసం పెట్టినప్పుడు.. ప్రభుత్వం విప్ జారీ చేసే అవకాశం ఇవ్వలేదు. దీంతో మెయిల్స్, సందేశాల ద్వారా విప్ జరీ చేశారు. ప్రభుత్వం, ఆ తర్వాత స్పీకర్ పైన పెట్టిన అవిశ్వాస తీర్మానానికి కూడా ప్రభుత్వం ఎత్తుకు పైఎత్తు వేసి జగన్‌కు అడ్డుకట్ట వేసింది.

ద్రవ్యవినిమయ బిల్లు సమయంలో విప్ జారీ చేసినప్పటికీ జగన్ సరైన జాగ్రత్తలు తీసుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎప్పుడైనా ఓటింగ్ డిమాండ్సు పైన ఉంటుందని, బిల్లు పైన ఉండదని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పి.. జగన్‌కు చివర్లో షాకిచ్చారు.
ఇక్కడే వైసిపి బోర్లా పడింది. జగన్‌కు ఉన్న సలహాదారుల వల్లే ఈ షాక్ జరిగి ఉంటుందని అంటున్నారు. జగన్ సలహాదారులు ప్రభుత్వం వ్యూహాన్ని పసిగట్టలేకపోయారని, కేవలం విప్ జారీ చేశాం, కాబట్టి ఓటింగు పెడతారని కూర్చొని ఉంటే సరిపోదని అంటున్నారు. చివర్లో పాయింట్ లాగిన యనమల.. జగన్‌కు షాకిచ్చారు.

సలహాదారుల వల్ల జగన్ నష్టపోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదటిసారి, ఆ తర్వాత రెండోసారి.. ఇప్పుడు మూడోసారి.. కూడా ప్రభుత్వం వ్యూహాన్ని పసిగట్టలేకపోవడం ఆయన సలహాదారుల వైఫల్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు, రోజా అంశాన్ని కూడా పదేపదే తీసుకు రావడం సరికాదంటున్నారు. రోజా అంశం వల్ల సమస్యలపై చర్చ జరగకుండా ప్రభుత్వానికే లాభం చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications