బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భారీ ఆదాయం..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం. ఇక్కడికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కనకదుర్గమ్మ హుండీకి భారీ ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. కేవలం 15 రోజుల్లోనే ఆలయ హుండీకీ భారీ ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు.
దుర్గామల్లేశ్వరస్వామివార్ల ఆలయంలోని మహా మండపంలోని ఆరో అంతస్తులో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. పదిహేను రోజులకు సంబంధించిన హుండీలలో భక్తులు సమర్పించిన కానుకల్ని లెక్కించారు. ఈ హుండీల కానుకల లెక్కింపులో ఈవోతో పాటుగా ఆలయ అధికారులు, సిబ్బంది, ఎస్‌పీఎఫ్, వన్‌టౌన్ పోలీసులు, భవానీ సేవాదారులు పాల్గొన్నారు. ఈ కానుకల్లో మొత్తం రూ.1,91,27,261ల డబ్బులు ఉండగా, 370 గ్రాముల బంగారం, 3కిలోల 850 గ్రాముల వెండి కానుకలు ఉన్నాయి. అలాగే వీ టితో పాటు ఇతర దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు కూడా ఉన్నాయి. అందులో యూఎస్ డాలర్లు 516, 1000 కొరియా వాన్‌లు, ఓమన్ బైంసాలు 100, ఆస్ట్రేలియా డాలర్లు 100, యూకే పౌండ్లు 80, ఇంగ్లాడ్ పౌండ్లు 40, కెనడా డాలర్లు 15, 5 యూరోలు, 2 సింగపూర్ డాలర్లు, 25 యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ దిర్హమ్స్, ఒక కువైట్ దినార్, 24 ఖతార్ రియాల్స్ హుండీలో భక్తులు సమర్పించారు.

ఈ-హుండీ ద్వారా కానుకలు..
వీటితో పాటు దుర్గమ్మకు ఆన్‌లైన్ ఈ-హుండీ ద్వారా కానుకలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రూ.44,831లు కానుకగా వచ్చాయని ఆలయ ఈవో కేఎస్ రామారావు వివరించారు. ఇదిలా ఉండగా, విజయవాడ దుర్గమ్మ ఆలయ అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన వధూవరులకు ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. వారికి వేదాశీర్వచనం, లడ్డూ ప్రసాదాలను ఉచితంగా అందజేయనున్నారు.












Click it and Unblock the Notifications