పీవీకి భారతరత్న.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి ఏమన్నారంటే!!
కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాన మంత్రి, దివంగత పీవీ నరసింహరావు సహా మాజీ ప్రధాన మంత్రి చౌదరి చరణ్ సింగ్ కు, హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వార ఆనందం వ్యక్తం చేసారు.
భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీవీకి భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు.

మాజీ ప్రధాని, తెలుగు తేజం పీవీ నరసింహారావుకు భారత రత్న ప్రకటించడం ప్రశంసనీయమని ఆయన కుమార్తె వాణీదేవి స్వాగతించారు. తన తండ్రికి భారతరత్న ఆలస్యంగా ప్రకటించినా సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న దక్కడం పట్ల బీఆర్ఎస్ అధినేత కెసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా కేసీఆర్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించటం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి గర్వకారణమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తారు. పివి తెచ్చిన సంస్కరణలు భారత్ ను ప్రపంచ వేదికపై నిలబెట్టాయని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆయన భూమి పుత్రుడని. ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, ప్రఖ్యాత పండితుడు, బహుభాషావేత్త, మానవతావాది అని చంద్రబాబు కొనియాడారు. రాష్ట్రం మరియు దేశం పట్ల ఆయన చూపిన దర్శనీయత నుండి స్ఫూర్తి పొంది అనేక సందర్భాలలో ఆయనను కలిసే గొప్ప అదృష్టాన్ని తాను పొందానన్నారు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పీవీ నరసింహారావు గారు చేసిన సేవలకు సముచిత గౌరవం దక్కిందని మన దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికిన నాయకుడు ఆయన అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పీవీ నరసింహారావు గారు అందించిన సేవలు అసమానమైనవని కొనియాడారు. పీవీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడం ప్రతి తెలుగువాడు సంతోషించదగిన అంశమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications