భీమవరం హాస్టల్‌లో విద్యార్థిపై పైశాచిక దాడి: నలుగురు అరెస్ట్ (వీడియో)
పశ్చిమగోదావరి: జిల్లాలోని భీమవరంలో ఓ విద్యార్థిని కర్రలతో దారుణంగా కొట్టి, ఇస్త్రీపెట్టెతో కాల్చిన ఘటనలో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రేమ విషయంలోనే అంకిత్ అనే వ్యక్తిని కొట్టినట్లు అరెస్టయిన విద్యార్థులు పోలీసులకు వెల్లడించారు. నిందితుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి అంకిత్‌ను గదిలో బంధించి క్రూరంగా హింసించారు. అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని మరో విద్యార్థి వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం ఈ ఘటన వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ.. ఐదుగురు విద్యార్థులు ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ప్రేమ వ్యవహారం కారణంగానే వీరి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది.
నరసన్నపేటకు చెందిన అంకిత్‌కు ప్రవీణ్, ప్రేమ్ కుమార్, స్వరూప్, నీరజ్ అనే నలుగురు విద్యార్థులకు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత నలుగురు విద్యార్థులు అంకిత్‌పై కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అంతేగాక, ఇస్త్రీపెట్టెతో శరీరంపై పలు చోట్ల కాల్చారు. దీంతో అంకిత్ కు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బాధిత విద్యార్థి అంకిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక నిందిత విద్యార్థులను కాలేజీ ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications