భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభవార్త చెప్పారు. నెల రోజుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంభం అవుతుంది అని వెల్లడించారు. ఉడాన్ 2.0 పథకం అమలు తీరు తెన్నుల పై ఢిల్లీలో జరిగిన వర్క్ షాప్ లో పాల్గొన్న అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు.
ప్రధాని మోడీ చేతుల మీదుగా త్వరలోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం
భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్న ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా త్వరలోనే దానిని ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తేదీ ఖరారు అయిన వెంటనే నెలరోజుల్లో విమానయాన కార్యకలాపాలు మొదలవుతాయని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కీలకమైన ప్రాజెక్టుగా, ఆ ప్రాంత పారిశ్రామిక, ఆర్థిక పురోగతికి దోహదం చేస్తున్నదని, కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

కేటగిరి 1విమానాశ్రయాల జాబితాలో 39వ స్థానంలో భోగాపురం ఎయిర్ పోర్ట్
ఇదిలా ఉంటే ఇప్పటికే ఇటీవల కేంద్ర హోమ్ శాఖ ఇమిగ్రేషన్ మరియు విదేశీయుల చట్టం 2025 పరిధిలో దీనికి గుర్తింపు ఇచ్చింది. దీంతో కేటగిరి 1విమానాశ్రయాల జాబితాలో 39వ స్థానంలో ఇది ఉంది. ఇమిగ్రేషన్ చెక్పోస్ట్ గా గుర్తింపు లభించడం వలన అంతర్జాతీయ విమాన సర్వీసులు సులభంగా నడపడానికి వీలు కలిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రత్యేకంగా దృష్టి సారించింది.
టూరిజం, వాణిజ్య రంగాలకు కొత్త ఊపిరి
ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ను వేగంగా పూర్తి చేయడంలో కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక భూమిక పోషించారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే టూరిజం, వాణిజ్య రంగాలకు కొత్త ఊపిరి వచ్చినట్టు అవుతుంది. స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారుతుంది.
గ్లోబల్ మ్యాప్ పైన భోగాపురం ఎయిర్పోర్ట్
ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ప్రాజెక్టుతో ఆర్థికంగా సామాజికంగా ముందుకు వెళుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ గ్లోబల్ మ్యాప్ పైన మరింత బలంగా నిలబెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి ప్రజలకు కానుకగా ఇవ్వనుంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.












Click it and Unblock the Notifications